IPL Auction 2022 Process: ఐపీఎల్ వేలం.. ఈ మాటెత్తగానే క్రికెట్ అభిమానులకు ఊపొచ్చేస్తుంది. అందులోనూ ఈసారి జరగబోయేది మెగా వేలం. పైగా ఈసారి రెండు జట్లు కొత్తగా ఐపీఎల్‌లో అడుగు పెట్టాయి. పాత ఆటగాళ్లలో గరిష్ఠంగా ఏ జట్టుతోనూ నలుగురికి మించి లేరు. అట్టిపెట్టుకున్న కొద్దిమంది ఆటగాళ్లు మినహా అందరూ వేలంలోకి వస్తున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియతో జట్ల ముఖ చిత్రాలే మారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. మరి శని, ఆదివారాల్లో జరిగే ఈ మెగా వేలం విశేషాలెంటో చూద్దామా..
వేదిక: బెంగళూరు
సమయం: మధ్యాహ్నం 12 నుంచి
తేదీలు: ఫిబ్రవరి 12, 13
జట్లు:చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
బెంగళూరు: మొత్తం 27 మంది ఆటగాళ్లను ఎనిమిది పాత ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి. కొత్త జట్లు లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ముగ్గురు చొప్పున ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే ఈ 33 మంది మినహా ఆటగాళ్లంతా వేలంలోకి రానున్నారు.
రికార్డు రేటు ఎవరికో?
590 మంది ఆటగాళ్లు మెగా వేలంలో అందుబాటులో ఉండనున్నారు. వీరిలో 370 మంది భారత క్రికెటర్లు కాగా. 220 మంది విదేశీ క్రికెటర్లు. మొత్తం 1214 మంది క్రికెటర్ల నుంచి 590 మందితో కుదించిన జాబితాను తయారు చేశారు. వీరిలో శిఖర్ ధావన్, అశ్విన్, కమిన్స్, డికాక్, డుప్లెసిస్, శ్రేయస్ అయ్యర్, రబాడ, షమి, వార్నర్, బౌల్ట్ ప్రాధాన్య ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. శ్రేయస్, వార్నర్, ధావన్ లాంటి ఆటగాళ్లకు భారీ పలికే అవకాశముంది. వీరిని కెప్టెన్లుగా నియమించుకోవడానికి బెంగళూరు, కోల్‌కతా, పంజాబ్ జట్లు పోటీ పడే అవకాశముంది. వీరి కనీస ధర రూ.2 కోట్లు. షమి, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఆజింక్య రహానె తదితరులతో కూడిన 48 మంది సీనియర్ క్రికెటర్లు కూడా తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇషాన్ కిషన్, పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ లాంటి వాళ్ల కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడనున్నాయి. రెండు కోట్ల కనీస ధరతో ఉన్న స్టార్ విదేశీ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, బౌల్ట్, కమిన్స్, రబాడ, డుప్లెసిస్‌లను దక్కించుకోవడం కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉండబోతోంది. రూ.1.5 కోట్లు కనీస ధరగా ఉన్నవాళ్లు 20 మంది.. రూ.1 కోటి కనీస ధరగా ఉన్నవాళ్లు 34 మంది వేలంలో ఉన్నారు. ఈ జాబితాలో అండర్-19 స్టార్లు యశ్ ధుల్, రవీంద్రన్ హంగార్కర్, విక్కీపై జట్లు కన్నేశాయి. దేశవాళీ పోటీల్లో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్, దీపక్ హుడా, అవేష్ ఖాన్‌లకు కూడా మంచి ధర పలికే అవకాశాలున్నాయి. నిషేధం తొలగిన పేస్ బౌలర్ శ్రీశాంత్ (కనీస ధర రూ.50 లక్షలు) కూడా వేలంలో ఉన్నాడు.
గరిష్ట, కనిష్ట ఆటగాళ్లు
వేలం ముగిసేసరికి ప్రతి జట్టులో కనిష్టంగా 18 మంది.. గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న రూ.90 కోట్ల నుంచి కనీసం రూ.67.5 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రతి జట్టులో ఎనిమిది మందికి తగ్గకుండా విదేశీ ఆటగాళ్లు ఉండాలి.