IPL Mega Auction: ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం రెండు రోజులపాటు (శనివారం, ఆదివారం) బెంగళూరు వేదికగా జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేశారు. ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభం కానుంది. ఈసారి వేలంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గత సీజన్‌లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న క్రికెటర్లను సొంత జట్లు వదిలేయగా మరొక ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. మరి అలాంటి ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా..
క్రిస్ మోరిస్:రాజస్థాన్ రాయల్స్ అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు. దాదాపు రూ. 16.25 కోట్లు సొంతం చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ గత సీజన్‌లో పెద్దగా రాణించిందేమీ లేదు. తన విలువకు తగ్గ న్యాయం మాత్రం చేయలేకపోయాడు. రెండు విడతలవారీగా జరిగిన 14వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణం. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు మెగా వేలంలో పాల్గొనడం లేదు.
ప్యాట్ కమిన్స్:ఆసీస్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 15.5 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్ వేదికగా జరిగిన పద్నాలుగో సీజన్ తొలి దశలో మాత్రమే ప్యాట్ కమిన్స్ ఆడాడు. ఏడు మ్యాచుల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్‌ను ఈసారి కేకేఆర్ రిటెయిన్ చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న కమిన్స్‌కు గతసారి మాదిరిగా భారీ ధర దక్కకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
మ్యాక్స్‌వెల్:ఆల్‌రౌండర్ అయిన ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్2020లో రాణించని మ్యాక్సీ.. రెండు దశల్లో జరిగిన ఐపీఎల్ 2021లో మాత్రం బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 మ్యాచులు 14 ఇన్నింగ్స్‌ల్లో 513 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 76 పరుగులు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటెయిన్ చేసుకుంది. అయితే ఈ సారి రూ. 11 కోట్లను మాత్రమే చెల్లించింది.
సునీల్ నరైన్:కేకేఆర్ తరఫున ఆడే ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను ఆ ఫ్రాంచైజీ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. విభిన్నమైన స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే నరైన్‌ను కేకేఆర్ రూ. 6 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. బ్యాటింగ్‌లోనూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. గత సీజన్‌లో కేకేఆర్ ఫైనల్‌కు రావడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో 62 పరుగులే చేసినా.. కీలక ఇన్నింగ్స్‌లను ఆడాడు.