IPL 2024 Mini Auction Highlights :ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలం పలు సంచలనాలకు వేదికైంది. ఈ మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డుల్లోకి ఎక్కగా 2007లో లీగ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా భారతదేశం వెలుపల ఈ వేలాన్ని నిర్వహించారు. మొత్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు రూ. 230.45 కోట్లు వెచ్చించి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
పది ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలంలో పాల్గొని నచ్చిన ఆటగాళ్లను కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేశాయి. పలువురు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు వెచ్చించాయి. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సందర్భంగా జరిగిన పలు సంచలనాత్మక విషయాలను ఓసారి పరిశీలిద్దాం.
తొలిసారి భారత్ వెలుపల వేలం
ఐపీఎల్ వేలం మొదటిసారిగా భారతదేశం వెలుపల జరిగింది. డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలాన్ని దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలలో నిర్వహించారు. 16 సంవత్సరాల లీగ్ చరిత్రలో ఐపీఎల్ వేలాన్ని భారతదేశంలో నిర్వహించడం ఇదే మెుదటిసారి.
తొలిసారి మహిళా ఆక్షనీర్
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఐపీఎల్ వేలం ప్రక్రియను ఓ మహిళా ఆక్షనీర్ నిర్వహించారు. ముంబయికి చెందిన మల్లికా సాగర్ ఈసారి ఐపీఎల్ వేలం ఆక్షనర్‌గా వ్యవహరించారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్ (PKL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL ) వేలం నిర్వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.
తొలిసారి రూ.20కోట్ల మార్క్
వేలంలో రూ.20 కోట్ల మార్కును ఒక ఆటగాడి చేరుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూ.20 కోట్ల క్లబ్‌లో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంతకు ముందు ఏ ఆటగాడు కూడా రూ.20 కోట్ల బిడ్ మార్కును చేరుకోలేదు.