IPL 2024 Auction Overseas Players :ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ రికార్డు ధర పలికారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. రూ. 24.75 కోట్ల భారీ ధరకు మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేయగా, రూ.20.50 కోట్లకు ప్యాట్‌కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది.
అయితే విదేశీ ఆటగాళ్లను కోట్ల డబ్బులు పెట్టి కొనుగోలు చేయడాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా, దినేశ్ కార్తీక్ తప్పుబట్టారు. విరాట్ కోహ్లీ వేలంలోకి వచ్చి ఉంటే రూ.42 కోట్లు పలికేవాడని ఆకాశ్ చోప్రా వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఫ్రాంచైజీలు దేశీయ ఆటగాళ్ల కోసం కాకుండా ఓవర్సీస్ ప్లేయర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయడం బాలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి భారీ మొత్తాలను సాధించేందుకు ఓవర్సీస్ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తెలివిగా వ్యవహరించారని డీకే వ్యాఖ్యానించాడు
కోహ్లీ వేలంలోకి వస్తే రూ.42 కోట్లు!
"ఐపీఎల్ వేలం రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయాలనే నిబంధనను తీసుకురావాలి. మిగిలిన రూ.50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఖర్చు చేయాలి. అప్పుడు కోహ్లీ వేలంలోకి వస్తే రూ.42 కోట్లు పలుకుతాడు' అని ఆకాశ్ చోప్రా సెటైరికల్‌గా మాట్లాడాడు.
ధోనీకి రూ.12కోట్లు- స్టార్క్‌కు రూ.25కోట్లా?
భారత ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువ ధర చెల్లించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎనిమిది సీజన్లు ఆడని మిచెల్ స్టార్క్ కోసం రూ.25 కోట్లు వెచ్చించడం బుద్ది తక్కువ నిర్ణయమని మండిపడ్డాడు. "భారత స్టార్ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా రూ.12 కోట్లు, మహమ్మద్ షమీ రూ.5 కోట్లు, ధోనీకి రూ. 12 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అలాంటిది 8 ఏళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఆటగాడికి రు. 25 కోట్లు ఖర్చు చేయడం సరైన నిర్ణయం కాదు" అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
ఓవర్సీస్ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు చాలా తెలివి!
భారీ మొత్తాలను సాధించేందుకు ఓవర్సీస్ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తెలివిగా వ్యవహరించారని దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించాడు. వేలంలోని లొసుగులను వినియోగించుకుని ఇంత పెద్ద మొత్తం సొంతం చేసుకున్నారని, ఇలాంటి ట్రెండ్ ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు. "నేరుగా మినీ వేలానికి వచ్చే ఆటగాళ్లకు నేను పెద్ద ఫ్యాన్‌ను కాదు. వేలంలోని లొసుగులను పట్టుకుని విదేశీ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తమ తెలివితేటలను చక్కగా వాడారు. మెగా వేలంలోకి కాకుండా మినీ వేలంలోకి తీసుకొచ్చి భారీ ధర దక్కేలా చేయడంలో విజయవంతమయ్యారు. అయితే ఇలాంటి ట్రెండ్ ఆరోగ్యకరమైన పోటీని దూరం చేస్తుంది. అందుకే బీసీసీఐ ఇలాంటి సమస్యను అదుపు చేయగలదని భావిస్తున్నాను" అని పోస్టు చేశాడు.
స్టార్క్‌పై కాసుల వర్షం- ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు- రూ. 24.75 కోట్లకు KKR కైవసం
'రూ.24.75 కోట్లు అస్సలు ఊహించలేదు- హైదరాబాద్ అంటే చాలా ఇష్టం!'