ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచి వేదికగా జరగనుంది. అయితే ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేయడానికి గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
ఇందులో భారత ఆటగాళ్లు 714 మంది. విదేశీ ఆటగాళ్ల సంఖ్య పరంగా ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది, స్కాట్లాండ్ నుంచి అత్యల్పంగా ఇద్దరు వేలం బరిలో దిగనున్నారు. దక్షిణాఫ్రికా (52), వెస్టిండీస్ (33), ఇంగ్లాండ్ (31), న్యూజిలాండ్ (27), శ్రీలంక (23), అఫ్గానిస్థాన్ (14), ఐర్లాండ్ (8), నెదర్లాండ్స్ (7), బంగ్లాదేశ్ (6), యూఏఈ (6), జింబాబ్వే (6), నమీబియా (5) ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది మాత్రమే అంతర్జాతీయ క్రికెటర్లు. దేశవాళీ క్రికెటర్లలో 604 మంది భారత క్రికెటర్లు. 20 మంది సభ్య దేశాల క్రికెటర్లు. అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడిన భారత ఆటగాళ్లు 91 మంది, విదేశీయులు 604 మంది వేలంలో పాల్గొననున్నారు. కాగా, 991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. కాగా 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.
ధర తగ్గించిన రహానే, ఇషాంత్ శర్మ.. ఈ సారి మినీవేలంలో 19 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్ ఈ సారి తమ బేస్ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. ఈ ఏడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ. 50 లక్షలకు తగ్గించాడు.
మయాంక్ మరీ దారుణం.. అదే విధంగా ఇషాంత్ కూడా తన బేస్ ప్రైస్‌ను రూ. 75లక్షలుగా నిర్ణయించుకున్నాడు. ఇక గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్ రాకతో కేఎల్ రాహుల్ తమ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం.