ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు విశేష ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 'సబ్‌స్టిట్యూట్'కు బదులుగా 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ప్రవేశపెట్టింది. దీంతో ప్లేయర్ హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.
ఇక వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకురానున్నట్లు కూడా ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకిచ్చిందని తెలిసింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కేవలం ఇండియన్ ప్లేయర్స్‌కే వర్తింపజేయనున్నదట. లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఈ రూల్ వర్తించదని చెప్పిందట. రూల్ విదేశీ ప్లేయర్లకు వర్తించకపోవడానికి గల కారణాలను కూడా జట్లకు స్పష్టంగా చెప్పిందని తెలిసింది.
నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ.. ఒక మ్యాచ్‌లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్‌ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్‌ను కేవలం భారత క్రికెటర్లకే వర్తిస్తుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేసిందట. ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.