ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఓ సరికొత్త విప్లవం. యావత్ క్రికెట్ ప్రపంచం ముందు బీసీసీఐని క్రికెట్ పెద్దన్నగా నిలిపింది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్.. ఏటా కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తమ జాతీయ జట్లను కాదని స్టార్ ప్లేయర్లంతా భారత్‌కు క్యూ కట్టేంత పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తోనే రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. ఎనిమిది ఫ్రాంచైజీలతో మొదలైన ఐపీఎల్.. గతేడాదే పది జట్లకు విస్తరించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌తో బీసీసీఐకి కోట్ల ఆదాయం వస్తోంది. మరి ఫ్రాంచైజీలకు ఏమైనా ప్రయోజనం ఉందా? వారికి ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి? ఐపీఎల్‌తో 10 ఫ్రాంచైజీలకు లాభామా? నష్టమా?
మీడియా హక్కుల ద్వారానే..
కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్లో ఫ్రాంఛైజీలకు లాభం కూడా అలానే ఉంటుంది. మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంఛైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. మొత్తం ఆదాయంలో 60 నుంచి 70 శాతం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది. అయితే ఈ సీజన్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించగా.. బీసీసీఐకు రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. టీవీ హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయోకామ్ సంస్థ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ లెక్కన బీసీసీఐకి ప్రతీ ఏడాది మీడియా రైట్స్ ద్వారా సుమారు రూ.9,670 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీలకు, 5 శాతం ప్రైజ్ మనీ కింద విభజిస్తారు.
టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా..
మీడియా హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఆదాయం లభిస్తుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా సంస్థ రూ. 439.8 కోట్లకు దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ ఫ్రాంఛైజీలకు పంచనుంది. ఇవి కాకుండా ప్రతి ఫ్రాంఛైజీకి కొంతమంది ప్రత్యేక స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఆ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటాయి.