IPL 2022: వారంతా గొప్పగొప్ప ఆటగాళ్లే.. ఎల్లలు దాటే రేంజ్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు.. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఈ లెక్కలు చూసే రూ.కోట్లు కుమ్మరించి మరీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేశాయ్. అయినా ఏం లాభం..? 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అన్నట్టుగా గత ఐపీఎల్‌లో వారి ప్రదర్శన చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అయినప్పటికీ ఐపీఎల్-2022 సీజన్‌లోనూ చూపులన్నీ వారిపైనే..!!
బౌన్స్ బ్యాక్ అవుతాడా..?
తన సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ ట్రోఫీని తెచ్చిపెట్టిన ఘనుడు డేవిడ్ వార్నర్. 848, 641, 692, 548.. వంటి భారీ పరుగులతో పలు సీజన్‌లలో మెరిసిన వార్నర్.. 2021 ఏడాది ఐపీఎల్‌లో మాత్రం పరుగుల కోసం చాలా కష్టాలే పడ్డాడు. ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ కేవలం 195 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసినప్పటికీ బ్యాటింగ్ సగటు 24.37గా ఉండటం గమనార్హం. అయితే, ఏ కారణం లేకుండా హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం బాధించాయని సీజన్ తర్వాత వార్నర్ వాపోయాడు. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే.. ఈసారి ఐపీఎల్-2022 మెగా వేలంలో వార్నర్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఐపీఎల్‌లో ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని వార్నర్ ఇటీవల సంతోషం వ్యక్తం చేశారు. మరి మార్చి 26 నుంచి 10 జట్లతో అతిత్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్‌లో ఈ స్టార్ బ్యాటర్ ఎలా విజృంభిస్తాడో? తన విమర్శకుల నోరు ఎలా మూయిస్తాడో వేచిచూడాలి.
మిస్టర్ కూల్ కూడా..!
అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి గతేడాది ఐపీఎల్ సీజన్ మొదటిది. తన సారథ్యంలో 2021 ఏడాదిలో జట్టుకు మరో కప్పు అందిచినప్పటికీ వ్యక్తిగతంగా ధోనీ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. 2021లో మొత్తం 16 మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 106.54 స్ట్రైక్ రేట్‌తో మొత్తంగా కేవలం 114 పరుగులే చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చినప్పటికీ ధోనీ అత్యధిక పరుగులు 18 నాటౌట్‌గా ఉండటం గమనార్హం. అయితే, కెరీర్‌లో అత్యంత విజయమంతమైన ధోనీని ఈ లెక్కలు చూసి ఓ అంచనా వేయలేం విపత్క పరిస్థితుల్లోనూ తన ఆలోచన శక్తితో జట్టును విజయ తీరాలకు చేర్చే సత్తా ఈ మహేంద్రుడికే చెల్లుతుంది. అందువల్లే ఈ సీజన్‌లో ధోనీని వేలంలో వదులుకోకుండా కెప్టెన్‌గా అంటిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
హార్దిక్ నడిపిస్తాడా..?
ఫామ్‌లేమితో గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్ ఆడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్-2022లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇన్నాళ్లు ముంబయి ఇండియన్స్‌లో పేస్-ఆల్ రౌండర్‌గా ఉన్న హార్దిక్.. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు. మొత్తంగా 12 మ్యాచ్‌లు 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 127 పరుగులే చేశాడు. జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికీ గత రెండు సీజన్లలో హార్దిక్ బౌలింగ్‌పై ముంబయి ఎప్పుడూ ఆధారపడలేదు. అయితే, ప్రస్తుతం బాగా సన్నద్ధమయ్యానని ఈ గుజరాతీ కొత్త కెప్టెన్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా ఒకప్పుడు వెలుగొందిన హార్దిక్.. ప్రస్తుత సీజన్‌లో కొత్త జట్టును ఎలా నడిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.
నికోలస్ లెక్క తప్పలేదా..!