IPL fans allowed or not: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌ను అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందిని అనుమతించవచ్చు. ప్రస్తుతానికి 25 శాతం మంది అభిమానులతో మ్యాచ్‌లు నిర్వహించి.. క్రమంగా ఈ సంఖ్య పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పరిమితిని సడలించే అవకాశం ఉంది.
IPL 2022
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం వాంఖడే స్టేడియంలో సుమారు 10 వేల మంది అభిమానులకు అనుమతి ఉంటుంది. బ్రబౌర్న్ స్టేడియంలో 7-8వేలు, డీవై పాటిల్, ఎంసీఏ స్టేడియంలలో 11-12 వేల మంది చొప్పున ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు.
ఇటీవల ఇండియా, శ్రీలంక టెస్టు మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. మొహాలీలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించగా.. బెంగళూరులో జరిగిన రెండో టెస్టుకు 100 శాతం మందికి అనుమతించారు. ఈ రెండు మ్యాచ్‌లు ప్రేక్షకులతో కళకళలాడాయి. ఈ నేపథ్యంలో ఖాళీ స్టేడియంలలో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ లేదని స్పష్టమవుతోంది.
గత రెండు సీజన్లకు ఫ్యాన్స్ దూరం...
గత రెండు ఐపీఎల్ సీజన్లపై కరోనా ప్రభావం చూపింది. 2020లో దేశంలో కరోనా తొలి వేవ్ ప్రారంభమైంది. దీంతో ఆ సీజన్ పూర్తిగా యూఏఈలో నిర్వహించింది బీసీసీఐ. 2021 ఐపీఎల్‌ను భారత్‌లోనే ప్రారంభించినా.. పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల.. టోర్నీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మిగిలన మ్యాచ్‌లను రెండో విడతలో యూఏఈ వేదికగా నిర్వహించింది.
ఇదీ చదవండి:కెప్టెన్సీ వదిలేశాక ప్రశాంతంగా ఉన్నా: కోహ్లీ