IPL 2022 Virat Kohli: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఆత్రుతగా ఉన్నారు బ్యాటర్లు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మునపటి దూకుడులేదు, పరుగులూ లేవు. బెంగళూరు జట్టు కెప్టెన్సీ వదులుకున్నాక మళ్లీ ఆనాటి కోహ్లీని చూపిస్తా అని అన్నాడు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో అలనాటి కోహ్లీని మళ్లీ చూడగలమా అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది.
IPL Virat Records: ఐపీఎల్‌లో కోహ్లీ ఏం ఓవర్‌నైట్ స్టార్ అయిపోలేదు. 2008లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. తొలి సీజన్లలో పెద్దగా రాణించింది లేదు. తొలి సీజన్ (2008)లో 12 ఇన్నింగ్స్‌లు ఆడి 165 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఏడాదిలో 246 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక 2010లో 307 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 2011లో అయితే 557 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకేశాడు. 2012కి వచ్చేసరికి కోహ్లీ కాస్త నెమ్మదించాడు. 364 పరుగులతో 16వ స్థానానికి పడిపోయాడు.
కింద పడితే అంతే వేగంగా పైకి లేచే గుణం ఉన్న కోహ్లీ.. 2013 టోర్నీలో అదరగొట్టాడు. దానికి తోడు కెప్టెన్‌గా ఆ ఏడాదే బెంగళూరు పగ్గాలు అందుకున్నాడు. దీంతో 634 పరుగులతో టోర్నీలో మూడో టాప్ స్కోరర్ అయ్యాడు. ఆ తర్వాతి ఏడాది (2014) అంతగా కలసి రాలేదు. 2015లో మరోసారి బ్యాట్ ఝళిపించాడు. 505 పరుగులతో అదరగొట్టాడు. అసలు సిసలు బ్యాటింగ్ సత్తా చూపించిన ఏడాది అంటే 2016. ఏకంగా 16 మ్యాచుల్లో 973 పరుగులు చేసి రికార్డు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సంపాదించాడు.
ఇక 2017లో కోహ్లీ సిరీస్ మధ్యలో గాయం కారణంగా వైదొలిగాడు. అయినా 10 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇక 2018లో బెంగళూరు.. ఈ పరుగుల యంత్రాన్ని రూ. 17 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. ఆ ఏడాది 530 పరుగులు చేశాడు. 2019లో కోహ్లీ బ్యాటు నుంచి మంచి పరుగులే వచ్చాయి. 14 మ్యాచ్‌ల్లో 464 పరుగులు చేశాడు. కానీ ఏడుగురు బ్యాటర్లు అతడిని దాటి వెళ్లిపోయారు. దీంతో కింగ్ కోహ్లీ వెనుకబడ్డాడు. 2020లోనూ ఇదే పరిస్థితి. 466 పరుగులతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక 2021లో అయితే కోహ్లీ నెం 12. 405 పరుగులు చేసినా సరిపోలేదు.