IPL 2022: ఐపీఎల్ 2022లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల్ని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని తెలిపింది. మార్చి 14,15 నుంచి జట్లన్నీ ప్రాక్టీస్‌ను ప్రారంభిస్తాయని వెల్లడించింది. ఐపీఎల్ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ సమావేశమైంది.
"ఐపీఎల్లో పాల్గొనే పది జట్లు వారి సిబ్బంది మార్చి 8 లోపు ముంబయికి చేరుకుంటాయి. 14-15 మధ్య ప్రాక్టీస్‌ను ప్రారంభిస్తాయి. టోర్నీలో పాల్గొనే వారంతా బయోబబుల్‌కు ముందు 3 నుంచి 5 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంటారు. ముంబయి ప్రయాణానికి 48 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. 5 రోజుల క్వారంటైన్లో మూడుసార్లు పరీక్ష చేస్తాం. మొదటి రోజు ఒకటి, రెండో రోజు మరొకటి, చివరి రోజు కూడా పరీక్షలు చేస్తాం. ఈ మూడు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ నుంచి విడుదల చేస్తాం. ప్రతి జట్టు ముంబయి, పుణెలోని నాలుగు వేదికల్లోనే ఆడతాయి. వారి ప్రాక్టీస్ సెషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆటగాళ్లకు బయోబబుల్ నుంచి రక్షణ కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బయోబబుల్‌లో ఆటగాళ్ల కదలికలను, నిబంధనల్ని పరిశీలిస్తాం. నవీ ముంబయి నుంచి పుణెకు ఆటగాళ్లు ప్రయాణించేటప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా కొవిడ్ పాజిటివ్‌గా తేలితే వారికి హోటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."
-బీసీసీఐ అధికారిక వర్గాలు.