తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: సన్​రైజర్స్​ సక్సెస్‌ వెనుక వ్యూహం ఇదేనా?

IPL 2022 Sunrisers Hyderabad: సీజన్​ను ఓటమితో ప్రారంభించినా ఆ తర్వాత వరుసగా హేమాహేమీ జట్లకు షాక్‌లిస్తూ ఐదు విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకుపోతోంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. ఈ నేపథ్యంలో సీజన్​ ప్రారంభం నుంచి సన్​రైజర్స్​ జర్నీపై లుక్కేద్దాం. అలాగే దాన్ని బలాలను పరిశీలిద్దాం..

Sunrisers Hyderabad Success Secret
సన్​రైజర్స్​ సక్సెస్‌ వెనుక వ్యూహం ఇదేనా

By

Published : Apr 27, 2022, 12:41 PM IST

తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో యువ క్రికెటర్లకు అర్థమయ్యేలా చెప్పేందుకు విభిన్న మార్గాలున్నాయి. వాటిలో 'వైఫల్యం' కూడా ఒకటి. ఆ దశను అనుభవించినప్పుడే అక్కడ ఏం జరిగిందనే విషయాలను నేర్చుకొంటారు. ట్రయల్‌ అండ్ ఎర్రర్‌ పద్ధతిని మా జట్టులో ప్రయత్నించి చూశాం. కొందరు వచ్చిన అవకాశాలను త్వరగా అందిపుచ్చుకుంటారు. వైఫల్యం ఎదురైనప్పుడు తాము ఎక్కడ నుంచి ప్రయాణం మొదలు పెట్టామనేది గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలానే యువకులు సరిగా ఆడనప్పుడు వారికి మేమున్నామంటూ భరోసానిస్తూ సరైన మార్గంలో నడిపించాలి. ఇదే మేం చేసిన కార్యాచరణ.. అందుకే విజయాలు సాధిస్తున్నాం.

-హైదరాబాద్‌ బ్యాటింగ్‌ కోచ్‌ బ్రియన్ లారా

ఇవేవో ఆషామాషీగా చేసిన వ్యాఖ్యలు కాదనిపిస్తోంది. టీ20 టోర్నీకి ముందు జరిగిన మెగా వేలంలో హైదరాబాద్‌ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో వ్యతిరేక కామెంట్లు చక్కర్లు కొట్టాయి. తేనీరు, బిస్కెట్లు తింటానికే మెగా వేలం కోసం వచ్చారా? అంటూ వెక్కిరింతలు.. ఆ తర్వాత సీజన్‌ను రెండు ఓటములతో ఆరంభించడంపై విమర్శలు.. ఇదీ కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ పరిస్ధితి. అయితే ఎవరెన్ని మాటలు అన్నాసరే టామ్‌ మూడీ నేతృత్వంలోని కోచింగ్‌ బృందం నిశ్శబ్దంగా తమ పని చేసుకుపోయింది. అసలైన తుపాన్‌ ముందుందని నిరూపించింది. లారా చెప్పినట్లు ట్రయల్ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో ఆటగాళ్లకు హితబోధ చేసినట్లున్నారు. వరుసగా హేమాహేమీ జట్లకు షాక్‌లిస్తూ ఐదు విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకుపోతోంది.

ఆ రెండు ఓటములతో.. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌.. విజయంపై పెద్దగా ఆశలు లేవు. కానీ.. బౌలింగ్‌ బాగానే ఉండటంతో రాజస్థాన్‌ను కట్టడి చేస్తారులే అనుకున్నారంతా. అయితే బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో 210/6 భారీ స్కోరు చేసింది. కేన్‌ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, నికోలస్‌ పూరన్‌ వంటి టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. మిడిలార్డర్‌లో మార్‌క్రమ్‌ (57)తోపాటు వాషింగ్టన్‌ సుందర్‌ (40), రొమారియో షెఫెర్డ్‌ (24) రాణించడంతో 149/7 స్కోరుకే పరిమితమై 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో విజయం కోసం కాస్త పోరాడింది. లఖ్‌నవూను 169/7 స్కోరుకే కట్టడి చేసిన హైదరాబాద్‌ చివరికి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లఖ్‌నవూ బౌలర్లు అవేశ్‌ ఖాన్‌ (4/2), హోల్డర్ (3/34), కృనాల్ పాండ్య (2/27) రాణించడంతో 157/9 స్కోరుకే పరిమితమైంది.

గత ఛాంపియన్‌ను ఓడించి..ఇక మూడో మ్యాచ్‌ డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నైతో తలపడింది. వరుసగా రెండు ఓటములతో విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలవడం కష్టమేనని అభిమానులు భావించారు. అయితే చెన్నైను అలవోకగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌లో తొలి విజయం తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌ యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మ (75)తోపాటు కేన్‌ విలియమ్సన్ (32), రాహుల్ త్రిపాఠి (39) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో సులువుగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నైను 154 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్‌.. లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో లేరు కాబట్టే హైదరాబాద్ గెలిచిందనే విమర్శలు వచ్చాయి.

తొలి గెలుపు గాలివాటం కాదని నిరూపించి..చెన్నైపై గెలుపు గాలి వాటంతో వచ్చింది కాదని నిరూపిస్తూ గుజరాత్‌పై హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. అప్పటి వరకు గుజరాత్‌ వరుసగా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి మరీ హైదరాబాద్‌తో పోరుకు వచ్చింది. ఈ క్రమంలో సమష్ఠిగా ఆడిన హైదరాబాద్‌ మరోసారి ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హార్దిక్‌ సేన ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగుల సాధించింది. మరోసారి హైదరాబాద్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (42), కేన్‌ విలియమ్సన్‌ (57) శుభ ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ ఔటైనప్పటికీ రాహుల్ త్రిపాఠి (17), నికోలస్ పూరన్‌ (34*), మార్‌క్రమ్‌ (12*) పని పూర్తి చేసేశారు. టాప్‌ జట్టుకే ఝలక్‌ ఇచ్చింది.

ఓపెనర్లు విఫలమైనా సరే..వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న హైదరాబాద్‌ మూడో మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొంది. ఈసారి బౌలర్లు కాస్త ధారాళంగానే పరుగులు సమర్పించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 175/8 స్కోరు చేసింది. భారీ లక్ష్య సాధనకు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (3), కేన్‌ విలియమ్సన్‌ (17) పెవిలియన్‌కు చేరారు. దీంతో అభిమానులకు మరోసారి పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఇక టపటపా వికెట్లు పడతాయిలే అనుకొని చాలా మంది హైదరాబాద్‌ అభిమానులు టీవీలను కట్టేసి ఉంటారు. అయితే, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాహుల్ త్రిపాఠి (71), మార్‌క్రమ్‌ (68) కీలక ఇన్నింగ్స్‌లతో విజయం చేకూర్చారు. 176 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే పూర్తి చేశారు. దీంతో హ్యాట్రిక్‌ విజయం హైదరాబాద్‌ సొంతమైంది.

పంజాబ్‌కు ఉమ్రాన్‌ దెబ్బ.. ప్రస్తుత టీ20 లీగ్‌ టోర్నీలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరు ఉమ్రాన్‌ మాలిక్‌. నిలకడగా 150 కి.మీపైగా వేగంతో బంతులను సంధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్‌ (4/28) మూడు వికెట్లు తీశాడు. వాటితోపాటు ఒక రనౌట్‌ కూడా ఉంది. ఈ ఓవర్‌లో ఒక్క పరుగు రాకుండానే నాలుగు వికెట్లు పడ్డాయ్‌. భువనేశ్వర్‌ కుమార్‌ (3/22) విజృంభణతో పంజాబ్‌ 151 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (3) వికెట్‌ను కోల్పోయినా.. ఏమాత్రం తడబడలేదు. అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34), మార్‌క్రమ్ (41*), నికోలస్‌ పూరన్ (35*) ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా హైదరాబాద్‌ను గెలిపించారు. ఈసారి కూడా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో 152 పరుగులు చేసి విజయం సాధించింది.

మరీ స్పెషల్‌.. బెంగళూరును చిత్తు చేసి.. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్‌, విరాట్ కోహ్లీ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు ఉన్న బెంగళూరును చూస్తే ఎలాంటి జట్టుకైనా హడల్. అయితే, హైదరాబాద్‌ బౌలర్ల ముందు మాత్రం వారి ఆటలు సాగలేదు. మార్కో జాన్‌సెన్‌ ఒకే ఓవర్‌లో డుప్లెసిస్‌ (5), అనుజ్‌ రావత్‌ (0), విరాట్ కోహ్లీ (0) ఔట్‌ చేసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం నటరాజన్ (3/10), సుచిత్ (2/12), భువనేశ్వర్‌ (1/8) విజృంభణతో బెంగళూరును 68 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా బెంగళూరు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొంది. మ్యాక్స్‌వెల్ (12), ప్రభుదేశాయ్‌ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారంటే హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో 72 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం విశేషం. దీంతో వరుసగా ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి!.. ఎలాంటి జట్టుకైనా సరే ఓపెనింగ్‌ బాగుంటే ఆటోమేటిక్‌గా మిడిలార్డర్‌ పరుగులు చేస్తుంది. రెండు మ్యాచుల్లో మిస్‌ అయిన ఈ టెక్నిక్‌ను హైదరాబాద్‌ బ్యాటర్లు ఒడిసిపట్టుకున్నారు. మూడో మ్యాచ్‌ నుంచి ఏడో మ్యాచ్‌ వరకు జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చకుండా ఆటగాళ్లపై నమ్మకంతో హైదరాబాద్‌ బరిలోకి దిగింది. ఓపెనర్లు అభిషేక్, కేన్‌ విలియమ్సన్‌ తొలుత నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించి స్కోరు బోర్డులో కాస్త పరుగులు చేర్చడం.. ఆపై బ్యాట్‌ను ఝళిపించడం చేస్తున్నారు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై భారీగా భారం లేకుండా ఉండటంతో వారు కూడా వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఇదే ఇప్పటి వరకు హైదరాబాద్‌ అనుసరించిన వ్యూహం. అదేవిధంగా బౌలింగ్‌లోనూ భువనేశ్వర్‌, ఉమ్రాన్‌, జాన్‌సెన్, నటరాజన్‌ వంటి ఫాస్ట్‌ బౌలర్లతోపాటు స్పిన్నర్‌ సుచిత్‌ కూడా రాణించడం హైదరాబాద్‌ కలిసొస్తుంది. మరి వచ్చే మ్యాచుల్లోనూ ఇదే ప్రణాళికలను అమలు చేసి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: IPL 2022: ముంబయి ఇండియన్స్​ @9967 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details