తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఈ ఆటగాళ్లైనా సన్​రైజర్స్​ను గట్టెక్కిస్తారా? - ఐపీఎల్​ 2022 మెగావేలం

IPL 2022 Mega auction: ఐపీఎల్​ మెగావేలం పూర్తైంది. ముగ్గిరిని రిటెయిన్​ చేసుకున్న సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఈ వేలంలో 20 ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఆ ఆటగాళ్లు ఎవరు? జట్టులో వారి పాత్ర ఏంటి? ఎలాంటి ప్రదర్శన చేయగలరు? ఈ సారైనా విజయాల బాట పడుతుందా? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం..

sunrisers hyderabad ipl 2022
సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు

By

Published : Feb 16, 2022, 2:02 PM IST

IPL 2022 Mega auction: ఐపీఎల్​లో అత్యంత పదునైన బౌలింగ్ దళం కలిగిన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో లోపాలతో స్వల్ప లక్ష్యాలను ఛేదించేందుకూ కష్టపడాల్సి వచ్చింది. గతేడాది దారుణమైన ప్రదర్శనతో పాయింట్లపట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరి ఇలాంటి స్థితిలో ఐపీఎల్‌ మెగా వేలం జరిగింది. ముగ్గురిని రిటెయిన్‌ చేసుకొని, 20 మంది క్రికెటర్లను ఎస్‌ఆర్‌హెచ్‌ వేలంలో దక్కించుకుంది. ఇందులో పలువురికి భారీ మొత్తం వెచ్చించింది. వచ్చే సీజన్‌లోనైనా ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల బాట పడుతుందో లేదో చూడాలి. ఈలోగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం..

కేన్‌ విలియమ్సన్‌ : ఎస్‌ఆర్‌హెచ్‌ సారథి. గత సీజన్‌ రెండో అంచెలో జట్టు పగ్గాలను అందుకున్నాడు. ఈసారి రూ. 14 కోట్లు చెల్లించి మరీ అట్టిపెట్టుకుంది. గత ఏడాది కేన్‌కు దక్కింది రూ. 3 కోట్లు మాత్రమే. నాయకుడిగా జట్టును అద్భుతంగా నడిపించడం సహా నిలకడైన బ్యాటింగ్‌తో నమ్మదగ్గ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. వన్‌డౌన్‌లో కీలక బ్యాటర్‌. ఫార్మాట్‌కు తగ్గట్టుగా రాణించడం కేన్‌ స్పెషాలిటీ. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత నింపాదిగా ఆడతాడో.. పరుగులు అవసరమైనప్పుడు అంతే దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు.

అబ్దుల్‌ సమద్‌ : అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అయిన అబ్దుల్‌ సమద్‌ లోయర్‌ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టగలడు. ఇప్పటి వరకు 23 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన సమద్‌ 146.1 స్ట్రైక్‌రేట్‌తో 222 పరుగులు చేశాడు. లెగ్‌ బ్రేక్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగలడు. అందుకేనేమో సన్‌రైజర్స్‌ సమద్‌ను రూ.4 కోట్లు ఇచ్చి మరీ రిటెయిన్‌ చేసుకుంది. మరి ఈసారైనా అబ్దుల్‌ సమద్ తన సత్తా ఏంటో అభిమానులకు చూపించాలి. గత సీజన్‌ వరకు సమద్‌కు దక్కింది కేవలం రూ. 20 లక్షలు మాత్రమే.

ఉమ్రాన్ మాలిక్‌ :దేశవాళీ క్రికెట్‌లో వేగవంతమైన బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌. బంతిని నిలకడగా 150 కి.మీ వేగంతో సంధించగలడు. ఈసారి బౌలింగ్ దళంలో కీలక అస్త్రంగా మారే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే వచ్చే ఐపీఎల్‌లో పేస్‌ బౌలింగ్‌ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. గత ఏడాదిలో మాలిక్‌కు రూ. 10 లక్షలను మాత్రమే చెల్లించింది.

మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌ :వీరంతా అంతర్జాతీయ, దేశవాళీలో అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లు. దీంతో బ్యాటింగ్ కాస్త పటిష్ఠంగా కనిపిస్తోంది. కేకేఆర్‌ తరఫున ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో త్రిపాఠి అద్భుతంగా రాణించాడు. లోయర్‌ ఆర్డర్‌తో కలిపి జట్టుకు విజయాలను అందించాడు. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌, కివీస్‌ కీపర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ వీరబాదుడుకు మారుపేరుగా ఉంటారు. నికోలస్‌ పూరన్‌ క్రీజ్‌లో కుదురుకుంటే భారీగానే పరుగులు చేయగల దిట్ట. పూరన్‌ అత్యధికంగా రూ.10.75 కోట్లు, త్రిపాఠి రూ. 8.50 కోట్లు, మార్‌క్రమ్‌ రూ. 2.60 కోట్లు, గ్లెన్‌ ఫిలిప్స్‌ రూ. 1.50 కోట్లు దక్కించుకున్నారు.

దండిగా ఆల్‌రౌండర్లు : ఈసారి మెగా వేలంలో సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపింది. వాషింగ్టన్‌ సుందర్‌(రూ.8.75 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), మార్కో జాన్‌సెన్ (రూ. 4.20 కోట్లు)‌, రొమారియో షెఫెర్డ్‌ (రూ.7.75 కోట్లు), శశాంక్‌ సింగ్‌ (రూ.20 లక్షలు)ను దక్కించుకుంది. ఇప్పటికే అబ్దుల్‌ సమద్‌ వంటి ఆల్‌రౌండర్‌ను రిటెయిన్‌ చేసుకుంది. ఇటీవల కాలంలో వాషింగ్టన్ సుందర్ టీమ్‌ఇండియా తరఫున లోయర్‌ ఆర్డర్‌లో కీలకమైన పరుగులు చేయడం చూశాం. గత సీజన్‌ వరకు విండీస్‌ మాజీ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించాడు. ఆ స్థానాన్ని రొమారియో షెఫెర్డ్‌ భర్తీ చేయనున్నాడు. ఇతడి కోసం సన్‌రైజర్స్‌ భారీ మొత్తం వెచ్చించింది.

మరోసారి భువీ నేతృత్వంలోనే :బౌలింగ్‌ జట్టుగా పేరున్న సన్‌రైజర్స్‌ ఈసారి కూడానూ మంచి బౌలర్లనే కొనుగోలు చేసుకుంది. భువనేశ్వర్‌ను మరోమారు దక్కించుకుంది. దీంతో అతడి నాయకత్వంలో ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌, కార్తిక్‌ త్యాగి, ఫాజల్‌హక్‌ ఫరూఖి, సీన్‌ అబాట్ పేస్‌ బౌలర్లు ప్రత్యర్థులపై దాడికి సిద్దంగా ఉన్నారు. వీరికి తోడుగా మార్కో జాన్‌సెన్‌, రొమారియో షెఫెర్డ్‌ ఆల్‌రౌండర్లూ ఉండనే ఉన్నారు. అదే విధంగా వాషింగ్టన్‌ సుందర్‌ సారథ్యంలో సౌరభ్‌ దూబే, శ్రేయస్‌ గోపాల్, జగదీశ సుచిత్‌ స్పిన్‌ దళం సన్‌రైజర్స్ సొంతం. భువికి రూ. 4.20 కోట్లు, నటరాజన్‌కు రూ.4 కోట్లు, కార్తిక్‌ త్యాగికి రూ.4 కోట్లు, సీన్ అబాట్‌కు రూ.2.40 కోట్లను ఎస్‌ఆర్‌హెచ్‌ చెల్లించింది.

ఇదీ చూడండి: Dubai Tennis Championships: క్వార్టర్​ ఫైనల్​లోకి సానియా మీర్జా జోడీ

ABOUT THE AUTHOR

...view details