తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఈసారైనా సన్​ 'రైజ్'​ అయ్యేనా! - bhuvaneshwar kumar news

IPL 2022 Sun Risers Hyderabad: స్టార్లు ఉండరు. హడావుడి కనిపించదు. ఆర్భాటాలు అగుపించవు. చాపకింద నీరులా పనికానిచ్చేయడం అలవాటు. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థికైనా చెమటలు పట్టించగలదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రత్యేకతలు ఇవి. కోచ్‌ టామ్‌ మూడీ తిరుగులేని వ్యూహాలు.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎదురులేని దూకుడుతో 2016లో ఛాంపియన్‌గా నిలవడం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ పతాక దశ. 2016 నుంచి 2020 వరకు ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన సన్‌రైజర్స్‌కు నిరుడు ఘోర పరాభవం ఎదురైంది. జట్టు పేలవ ప్రదర్శన, వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల మొదలైన గత సీజన్‌ ప్రయాణం.. 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ముగిసింది. ఎప్పట్లాగే వేలంపాటలో తనదైన శైలిలో ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్‌.. సరికొత్త కూర్పుతో ఈసారి ముస్తాబైంది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌ సత్తా చాటుతుందా? 2016 ప్రదర్శనను పునరావృతం చేస్తుందా?

Sun Risers Hyderabad news
IPL 2022

By

Published : Mar 24, 2022, 7:59 AM IST

IPL 2022 Sun Risers Hyderabad: వార్నర్‌ అంటే సన్‌రైజర్స్‌.. సన్‌రైజర్స్‌ అంటే వార్నర్‌! గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ అభిమానులకు తెలిసింది ఇదే. జట్టుపై అంతలా ముద్రవేసిన వార్నర్‌.. ఆరెంజ్‌ ఆర్మీకి దూరం కాగా.. విలియమ్సన్‌ నాయకత్వంలో కొత్త కూర్పుతో సన్‌రైజర్స్‌ సిద్ధమైంది. న్యూజిలాండ్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతగా.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిపిన విలియమ్సన్‌కు మూడు ఫార్మాట్లలో సారథిగా గొప్ప రికార్డే ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మేటి నాయకుడైన విలియమ్సన్‌.. సన్‌రైజర్స్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎలాంటి మాయాజాలం చేస్తాడన్నది ఆసక్తికరం. నిరుటి అపప్రద నుంచి సన్‌రైజర్స్‌ను బయటపడేసి జట్టులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చేందుకు విలియమ్సన్‌ శక్తిమేరకు ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు.

ఇక విలియమ్సన్‌తో పాటు ఊహించని విధంగా బ్యాటర్‌ అబ్దుల్‌ సమద్‌, పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌లను అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్‌.. వేలంపాటలోనూ భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కోసం రూ.15 కోట్ల వరకు పోటీపడి విఫలమైన సన్‌రైజర్స్‌.. నికోలస్‌ పూరన్‌ (రూ.10.75 కోట్లు)ను ఎంపిక చేసుకుంది. వాషింగ్టన్‌ సుందర్‌ (రూ.8.75 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), రొమారియో షెఫర్డ్‌ (రూ.7.75 కోట్లు), అభిషేక్‌శర్మ (రూ.6.5 కోట్లు)ల కోసం భారీగానే వెచ్చించింది. మార్‌క్రమ్‌ను రూ.2.6 కోట్లకే దక్కించుకున్న సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగాల్లో నాణ్యమైన ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. సన్‌రైజర్స్‌ సరైన కూర్పుతో బరిలో దిగితే మరోసారి ప్లేఆఫ్స్‌ చేరడం ఖాయమే. ఇక మూడీ (చీఫ్‌ కోచ్‌), ముత్తయ్య మురళీధరన్‌ (బౌలింగ్‌ కోచ్‌), బ్రయాన్‌ లారా (బ్యాటింగ్‌ కోచ్‌), డేల్‌ స్టెయిన్‌ (బౌలింగ్‌ కోచ్‌) వంటి హేమాహేమీ దిగ్గజాల వ్యూహ బృందం సన్‌రైజర్స్‌ను ఎలా నడిపిస్తుందన్నది చూడాలి.

బలాలు

కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​

ఓపెనర్‌ వార్నర్‌ నిలకడైన బ్యాటింగ్‌ 2020 సీజన్‌ వరకు సన్‌రైజర్స్‌కు పెట్టని కోట. అగ్నికి వాయువు తోడైనట్లు బెయిర్‌స్టో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ దుర్భేధ్యంగా ఉండేది. టాప్‌ ఆర్డర్‌పై సన్‌రైజర్స్‌ భారీగా ఆధారపడేది. ఇప్పుడు కూడా అదే వ్యూహం పాటించనుంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆధారపడదగిన బ్యాటర్‌.. విలియ్సమన్‌. కెప్టెన్‌ విలియమ్సన్‌ చుట్టూనే సన్‌రైజర్స్‌ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను అల్లుకోనుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌, వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ల రూపంలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద సానుకూలాంశం. భారీ షాట్లు ఆడగలిగే మార్‌క్రమ్‌ ఆఫ్‌ స్పిన్‌ కూడా వేయగలడు. విండీస్‌ తరఫున అత్యధిక ధర రూ.10.75 కోట్లకు అమ్ముడైన పూరన్‌.. మిడిలార్డర్‌లో కొండంత బలం కాగలడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల పూరన్‌.. స్పిన్‌, పేస్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు.

కోల్‌కతా తరఫున సత్తా చాటిన రాహుల్‌ త్రిపాఠిని వేలం పాటలో కొనుక్కోవడం కలిసొచ్చేదే. వెస్టిండీస్‌ పేసర్‌ రొమారియో షెఫర్డ్‌ మంచి స్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయగలడు. డెత్‌ ఓవర్లలో బౌలర్‌గా షెఫర్డ్‌ జట్టుకు బాగా పనికొస్తాడు. ఇక గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగల ఉమ్రాన్‌ మాలిక్‌ సన్‌రైజర్స్‌కు తురుపుముక్కే. గత సీజన్‌లో వెలుగులోకి వచ్చిన మాలిక్‌ను సన్‌రైజర్స్‌ మరింత సానబెట్టింది. భువనేశ్వర్‌, నటరాజన్‌ల స్వింగ్‌కు మాలిక్‌ వేగం బలం చేకూర్చేదే.

బలహీనతలు

భువనేశ్వర్‌ కుమార్‌

సన్‌రైజర్స్‌ అతి పెద్ద బలహీనత.. మిడిలార్డర్‌. గత కొన్ని సీజన్‌లలో మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లపై అతిగా ఆధారపడిన సన్‌రైజర్స్‌ గెలవాల్సిన మ్యాచ్‌ల్ని చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మల వైఫల్యం జట్టుకు నష్టం చేసింది. చాలా సీజన్‌లు వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ బాధ్యతల్ని భుజాన మోశారు. వాళ్లు బాగా ఆడినా.. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో విధ్వంసకర బ్యాటర్లు లేకపోవడం సన్‌రైజర్స్‌కు నష్టం చేసింది. ఇప్పుడు వార్నర్‌, బెయిర్‌స్టోలతో పాటు పొటి ఫార్మాట్‌లో ప్రపంచ మేటి లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ జట్టులో లేరు. గతంలో సన్‌రైజర్స్‌ విజయాల్లో వార్నర్‌, బెయిర్‌స్టో, రషీద్‌ల పాత్రే అత్యధికంగా ఉండేది. ఆ ముగ్గురి లోటును భర్తీ చేయడం అంత సులువు కాకపోవచ్చు.

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో విలియమ్సన్‌, పూరన్‌, మార్‌క్రమ్‌, అబ్దుల్‌ సమద్‌, త్రిపాఠి, అభిషేక్‌ శర్మ సేవల్ని సమర్థంగా వినియోగించుకోవడం జట్టుకు సవాల్‌. సన్‌రైజర్స్‌కు గాయాలు కూడా ప్రధాన సమస్యే. విలియమ్సన్‌ చాలా రోజులుగా మోచేతి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పేసర్‌ నటరాజన్‌ మోకాలి గాయం కారణంగా సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వచ్చాడు. రెండేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్‌లో మునుపటి పదును లేకపోవడం సన్‌రైజర్స్‌కు ప్రతికూలాంశమే.

దేశీయ ఆటగాళ్లు:భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, రాహుల్‌ త్రిపాఠి, ప్రియమ్‌ గార్గ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కార్తీక్‌ త్యాగి, రవికుమార్‌ సమర్థ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, శశాంక్‌సింగ్‌, విష్ణు వినోద్‌, శ్రేయస్‌ గోపాల్‌, జగదీశ సుచిత్‌, సౌరభ్‌ దూబె,

విదేశీయులు:విలియమ్సన్‌, మార్‌క్రమ్‌, మార్కో జాన్సెన్‌, రొమారియో షెఫర్డ్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సీన్‌ అబాట్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ

వీళ్లు కీలకం: విలియమ్సన్‌, పూరన్‌, మార్‌క్రమ్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

ఉత్తమ ప్రదర్శన: 2016లో విజేత

ఇదీ చదవండి:IPL 2022: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!

ABOUT THE AUTHOR

...view details