IPL 2022: ఐపీఎల్.. రెండు నెలల పాటు సాగే క్రికెట్ సమరం. ఎనిమిది జట్లతో కొనసాగుతున్న ఈ టోర్నీలోకి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్త జట్లు కొత్తగా ఎంట్రీ ఇచ్చాయి. దీంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ టోర్నీలో కొందరు ఆటగాళ్లు గాయం కారణంగా తప్పుకోగా.. మరికొందరు వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐపీఎల్ తొలివారానికి దూరం కానున్నారు. వారెవరంటే..?
తొలి వారం.. కంగారూలు దూరం..
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ వారంలో పాల్గొనట్లేదు. ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్ తొలి వారం ఐపీఎల్ మ్యాచులకు దూరం కానున్నారు. ఆరోన్ ఫించ్, కమిన్స్ కోల్‌కతాకు.. మ్యాక్స్‌వెల్, హెజిల్వుడ్ బెంగళూరుకు ఆడనున్నారు. స్టోయినిస్ కొత్త జట్టు లఖ్‌నవూకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
విండీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా!
వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడుతున్నాయి. ఈ సిరీస్ మార్చి 28న ముగియనుండగా.. ఐపీఎల్ మార్చి 26న మొదలు కానుంది. టెస్టు సిరీస్‌లో పాల్గొన్న ఇరు దేశాల ఆటగాళ్లు వారం రోజుల పాటు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్, జానీ బెయిర్‌స్టో.. ఐపీఎల్ ఆరంభ వారానికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మేయర్స్‌ను లఖ్‌నవూ, జోసెఫ్‌ను గుజరాత్ సొంతం చేసుకున్నాయి. బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
ఇక.. కొంతమంది ఆటగాళ్లు పూర్తి సీజన్ నుంచి కూడా దూరమయ్యారు. ఓపెనర్ జేసన్ రాయ్ ఐపీఎల్‌కు దూరం కాగా, పేసర్ మార్క్ వుడ్ గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గతేడాది ఫైనలిస్టులు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడనున్నాయి.
ఇదీ చదవండి:IPL 2022: విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!