Pragyan Ojha About Rohit: 2013 ఐపీఎల్ మధ్యలో పాంటింగ్ నుంచి ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు రోహిత్ శర్మ. అదే సీజన్లో జట్టుకు టైటిల్ అందించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2015, 2017, 2019, 2020లో కూడా ముంబయిని ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు హిట్‌మ్యాన్. ప్రస్తుతం టీమ్ఇండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ కూడా ఇతడే.
అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గతంలో డెక్కన్ ఛార్జర్స్(డీసీ), ముంబయి ఇండియన్స్‌కు ఆడిన టీమ్ఇండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా. 2011 ఐపీఎల్‌కు ముందు వేలం జరగకపోయినా, ముంబయి కొనకపోయినా ఆ సీజన్లో రోహిత్ డెక్కన్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేవాడని అన్నాడు.
రోహిత్ నాయకత్వ లక్షణాలను అప్పడి డీసీ కెప్టెన్ గిల్లీ గుర్తించాడని, తన తర్వాత జట్టు పగ్గాలు అతడికే అప్పగించాలనుకున్నట్లు గిల్‌క్రిస్ట్ భావించాడని ఓజా గుర్తుచేసుకున్నాడు. రోహిత్ తొలి 3 ఐపీఎల్ సీజన్లలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడు. ఆ తర్వాత వేలం నిర్వహించగా.. ముంబయి ఇండియన్స్ భారీ మొత్తానికి హిట్ మ్యాన్‌ను దక్కించుకుంది.
''బ్యాటర్‌గా రోహిత్లో అసాధారణ ప్రతిభ ఉంది. దేశవాళీల్లోనూ ముంబయి.. రోహిత్‌ను కెప్టెన్‌గా చూడలేదు. కానీ రోహిత్ డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడుతున్నప్పుడు అతడిలో కెప్టెన్సీ నైపుణ్యాలను గిల్లీ గుర్తించాడు. రోహిత్ బ్యాటింగ్ తీరు, అతడికి ఉన్న స్పష్టత, ఒత్తిడిలో ఆడే విధానం.. గిల్‌క్రిస్ట్‌కు నచ్చాయి. అప్పుడే డెక్కన్ ఛార్జర్స్‌కు నెక్ట్స్ కెప్టెన్ రోహితే అని నేను అనుకున్నా.''