ఐపీఎల్‌లో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ (6,283) పరుగులతో అందరికన్నా ముందుండగా.. శిఖర్ ధావన్ (5,784), రోహిత్ (5,611) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ చోటు సాధించడం విశేష. అయితే, ఇదే టోర్నీలో అత్యధిక సిక్సులు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో మాత్రం హిట్‌మ్యాన్ ఒక్కడే స్థానం దక్కించుకొన్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-15వ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ రెండు జాబితాల్లో ఎవరెవరు టాప్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
అత్యధిక బౌండరీల వీరులు
శిఖర్ ధావన్: ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ధావన్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడగా 4,567 బంతులు ఎదుర్కొని 5,784 పరుగులు చేశాడు. అందులో 654 ఫోర్లు, 124 సిక్సర్లు కొట్టాడు.
విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు 207 మ్యాచ్‌ల్లో 4,835 బంతులు ఎదుర్కొని 6,283 పరుగులు చేశాడు. అందులో 546 ఫోర్లు, 210 సిక్సర్లు ఉన్నాయి.
డేవిడ్ వార్నర్: ఇన్నాళ్లూ సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉండి ఇప్పుడు దిల్లీ జట్టుకు తరలిపోయిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 3,893 బంతులు ఎదుర్కొని.. 5,449 పరుగులు చేశాడు. వాటిలో 525 బౌండరీలు, 201 సిక్సర్లు సంధించాడు.
సురేశ్ రైనా: ఇక ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా నాలుగో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 205 మ్యాచ్‌ల్లో 4,402 బంతులు ఎదుర్కొని 5,528 పరుగులు చేశాడు. అతడు 506 బౌండరీలు, 203 సిక్సర్లు సాధించాడు.
రోహిత్ శర్మ: ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్‌కు గొప్ప రికార్డు ఉంది. అతడు ఇప్పటి వరకు 213 మ్యాచ్‌లు ఆడి.. 4,303 బంతులు ఎదుర్కొని 5,611 పరుగులు చేశాడు. అందులో 491 ఫోర్లు, 227 సిక్సర్లను నమోదు చేశాడు.