IPL 2022 Ricky Ponting: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ టార్గెట్ ఫిక్స్ చేశాడు. పాత ఆటగాళ్లు.. ఇటీవల కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలని సూచించాడు. ఇటీవల తొలి సెషన్‌లో పాల్గొన్న ఆటగాళ్లను ఉద్దేశించి రికీ పాంటింగ్ మాట్లాడాడు. ఆ వీడియోను దిల్లీ యాజమాన్యం ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
'కెప్టెన్ రిషభ్ పంత్, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్, అక్షర్ పటేల్.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్ల బాధ్యతను తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఎక్కడికి వెళ్లినా కొత్త ఆటగాళ్లను వెంట తీసుకెళ్లాలి. వారికి అందుబాటులో ఉండేలా.. ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచాలి. ఓ కోచ్‌గా, సీనియర్ ఆటగాడిగా జట్టులోని యువ ఆటగాళ్లను చేరదీస్తే.. వాళ్లు మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తారు. కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎప్పుడూ ఆటగాళ్లకు అందుబాటులో ఉండాల్సిందే. అతడితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యతలు పంచుకుంటే బాగుంటుంది' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, పేసర్ అన్రిచ్ నార్జ్‌లను దిల్లీ యాజమాన్యం వేలానికి ముందే రిటెయిన్ చేసుకుంది.
ఆయనను ఎప్పుడు కలిసినా ప్రత్యేకమే : రిషభ్ పంత్