తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​కు వేళాయెరా.. 10 జట్లతో ఈసారి మరింత కొత్తగా... - ipl fixtures

IPL 2022 Returns Home: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్​ పండగకు వేళైంది. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 15వ సీజన్​ శనివారమే ప్రారంభం కానుంది. కరోనా కారణంగా టోర్నీ చివరి సగం మ్యాచ్​లను గతేడాది యూఏఈలో నిర్వహించగా.. ఈసారి మాత్రం అన్ని మ్యాచ్​లు భారత్​లోనే జరుగుతాయి. డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​ కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలిమ్యాచ్​ మార్చి 26 రాత్రి 7.30 గంటలకు జరగనుంది. మే 29న ఫైనల్​.

IPL 2022 returns home bigger than ever
IPL 2022 returns home bigger than ever

By

Published : Mar 25, 2022, 6:53 PM IST

IPL 2022 Returns Home:క్రికెట్​ అభిమానులకు మరో రెండు నెలలు పండగే. అంతులేని వినోదాన్ని పంచేందుకు.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ వచ్చేసింది. మార్చి 26న డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​ కోల్​కతా నైట్​రైడర్స్​ మ్యాచ్​తో.. టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. మే 29న ఫైనల్​తో టోర్నీ ముగియనుంది. రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్​ ఈసారి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చివరిసారిగా 2011లో ఐపీఎల్​ 10 జట్లతో నిర్వహించారు. అప్పటి నుంచి 8 జట్ల మధ్యే టోర్నీ జరగగా.. ఈసారి లఖ్​నవూ సూపర్​జెయింట్స్​, గుజరాత్​ టైటాన్స్​ కొత్తగా వచ్చి చేరగా మళ్లీ మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. వివో స్థానంలో టాటా.. ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తోంది.

మ్యాచ్​లన్నీ భారత్​లోనే:రెండేళ్ల తర్వాత ఐపీఎల్​ టోర్నీ మొత్తం భారత్​లోనే జరగనుంది. కొవిడ్​ లాక్​డౌన్​తో 2020 ఐపీఎల్​ యూఏఈలో నిర్వహించగా.. గతేడాది చివరి సగం మ్యాచ్​లను అక్కడికే తరలించాల్సి వచ్చింది. దేశంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా.. తిరిగి స్వదేశంలోనే మ్యాచ్​లు జరగనున్నాయి. అయితే లీగ్​ దశలో అన్ని మ్యాచ్​లు ముంబయి, పుణెలోనే నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్​, ఫైనల్​ వేదికలు, తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. ఈసారి మాత్రం మైదానాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు.

ఐపీఎల్​లో ప్రేక్షకులకు అనుమతి

ఈసారి 70 మ్యాచ్​లు:జట్ల సంఖ్య పెరిగిన కారణంగా..ఈసారి భిన్న ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. గతంలో మాదిరి ప్రతి జట్టూ అన్ని జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడవు. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనల్స్‌ ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబయి ఇండియన్స్​, కోల్‌కతా నైట్​రైడర్స్​, రాజస్థాన్‌ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​, లఖ్‌నవూ సూపర్​ జెయింట్స్​ గ్రూప్‌-ఏలో.. చెన్నై సూపర్​ కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్‌, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్​, గుజరాత్‌ టైటాన్స్​ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూపులోని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అంటే ప్రతి జట్టూ ఎప్పటిలాగే 14 మ్యాచ్‌లే ఆడుతుందన్నమాట. 2011లో 10 జట్లతో జరిగిన ఐపీఎల్‌లో కూడా దాదాపుగా ఇదే ఫార్మాట్‌.

12 డబుల్‌ హెడర్‌లు: ఈ సీజన్‌లో మొత్తం 12 డబుల్‌ హెడర్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30కు మొదలవుతుంది. రాత్రి మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30కు ఆరంభమవుతాయి. మొదటి డబుల్‌ హెడర్‌ ఈ నెల 27న ఉంది. పగలు జరిగే మ్యాచ్‌లో దిల్లీతో ముంబయి తలపడుతుంది. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను బెంగళూరు ఢీకొంటుంది. దాదాపు ప్రతి శని, ఆదివారాల్లో రెండేసి చొప్పున మ్యాచ్​లు జరగనున్నాయి.

ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లుంటాయి. లీగ్‌ దశలో 10 జట్లు మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్‌ సహా నాలుగు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాలు 55 లీగ్‌ మ్యాచ్‌లకు, పుణె శివార్లలోని ఎంసీఏ స్టేడియం 15 లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ (సన్‌రైజర్స్‌ × పంజాబ్‌ కింగ్స్‌) మే 22న వాంఖడేలో జరుగుతుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

వరల్డ్​కప్​లో చోటు కోసం:ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా వేదికగా టీ-20 ప్రపంచకప్​ జరగనుంది. అందులో చోటే లక్ష్యంగా.. ఎందరో ఆటగాళ్లకు ఐపీఎల్​ చక్కటి వేదికగా నిలవనుంది. ఈసారి ఐపీఎల్​కు ముందు మెగా వేలం జరిగింది. విదేశీ స్టార్లు సహా భారత్​లోని దేశవాళీ క్రికెటర్లు, అండర్​-19 ప్లేయర్లపైనా కాసులవర్షం కురిసింది. ఆయా ఫ్రాంఛైజీలు ఏరికోరి కొందరిపై కోట్లు కురిపించాయి. వారంతా ఎలా రాణిస్తారో చూడాలి. చాలా మంది వర్ధమాన క్రికెటర్లు ఈ ఐపీఎల్​లో రాణించి.. జాతీయ జట్టులో చోటు సంపాదించాలని ఊవిళ్లూరుతున్నారు.

ఐపీఎల్​లో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్​ అత్యధికంగా ఐదుసార్లు (2013,2015,2017,2019,2020) టైటిల్​ గెల్చింది. చెన్నై సూపర్​ కింగ్స్​ 4 సార్లు(2010,2011,2018,2021) గెలిచి రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్​ ఛాంపియన్​ హోదాలో ఈసారి బరిలోకి దిగుతోంది. కోల్​కతా నైట్​రైడర్స్​(2014,2016) రెండుసార్లు, హైదరాబాద్​ రెండుసార్లు(2009- డెక్కన్​ ఛార్జర్స్​, 2016- సన్​రైజర్స్​ హైదరాబాద్​) విజేతలుగా నిలిచాయి. తొలి ఐపీఎల్​లో(2008) రాజస్థాన్​ రాయల్స్​ ఛాంపియన్​గా అవతరించింది.

రోహిత్​ శర్మ, ధోనీ

ముంబయికి ప్రయోజనమా?ఈసారి మ్యాచ్​లన్నీ ముంబయి, పుణెలోనే జరగనుండగా.. రోహిత్​ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ జట్టుకు ఇది మేలు చేస్తుందని పలువురు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిట్​ మ్యాన్​ ఇటీవలే స్పందించాడు.ఐపీఎల్ 2022 సీజన్‌ ముంబయిలో నిర్వహించడం వల్ల తమకు వచ్చే ప్రయోజనం ఏం లేదని రోహిత్ అన్నాడు. జట్టులో 80 శాతం కొత్తవాళ్లేనని, పైగా గత రెండేళ్లుగా ముంబయిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదని గుర్తు చేశాడు. ముంబయిలో కెప్టెన్​ రోహిత్​ శర్మతో పాటు కీరన్​ పొలార్డ్​, సూర్యకుమార్​ యాదవ్​, జస్​ప్రీత్​ బుమ్రా, ఇషాన్​ కిషన్​ స్టార్​ ఆటగాళ్లు. జట్టు వీరిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. పాండ్య సోదరులు సహా కొన్నేళ్లుగా జట్టులో ఉంటున్న ట్రెంట్​ బౌల్ట్​ను వేలానికి ముందు వదిలిపెట్టింది. వేలంలోనూ వీరిపై ఆసక్తి చూపలేదు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్సీని విరాట్​ కోహ్లీ వదిలేయగా.. అతడి స్థానంలో సౌతాఫ్రికా స్టార్​ డుప్లెసిస్​ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీ.. ఇప్పుడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క టైటిల్​ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలని ఉత్సాహంగా ఉంది. జట్టులోకి చాలా మంది కొత్త ప్లేయర్లు వచ్చిచేరారు. గతేడాది పర్పుల్​ క్యాప్​ హోల్డర్​ హర్షల్​ పటేల్​, హసరంగలను వేలంలో భారీ ధరకు తిరిగి దక్కించుకుంది.

విరాట్​ కోహ్లీ

ధోనీకి చివరిదా? ఐపీఎల్​ ప్రారంభానికి 3 రోజుల ముందు చెన్నై కెప్టెన్సీని వదిలేశాడు భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్​ ధోనీ. అతడి స్థానంలో జడేజా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. కొద్దికాలంగా అంతర్జాతీయ క్రికెట్​లో విశేషంగా రాణిస్తున్న జడేజాకు కెప్టెన్​గా నిరూపించుకునేందుకు ఇదో చక్కటి అవకాశంగా క్రికెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనీ నీడలో జడేజా రాటుదేలుతాడని అంటున్నారు. ఇప్పటికే 40 ఏళ్లుదాటిన మహీ.. వచ్చే ఐపీఎల్​ ఆడేది అనుమానమే.

చెన్నై సూపర్​ కింగ్స్​

దిల్లీ క్యాపిటల్స్​ను 2020లో ఫైనల్​ చేర్చిన శ్రేయస్​ అయ్యర్​.. గతేడాది ప్రారంభంలో ఐపీఎల్​ ఆడలేదు. ఈసారి అతడిని కేకేఆర్​ వేలంలో దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే రెండుసార్లు ట్రోఫీ గెలిచిన కేకేఆర్​.. శ్రేయస్​ సారథ్యంలో మరోసారి కప్పు కొడుతుందా? వేచి చూడాలి. వరుస గాయాలతో సతమతమవుతూ టీమ్​ఇండియాలో చోటు కోల్పోయిన హార్దిక్​ పాండ్యను ముంబయి ఇండియన్స్​ వదిలేసింది. పాండ్య ఈసారి గుజరాత్​ టైటాన్స్​కు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. మరి కెప్టెన్​గా అనుభవం లేని అతడు జట్టును ఎలా నడిపించగలడో చూడాలి.

శ్రేయస్​ అయ్యర్​

కేఎల్​ రాహుల్​ లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. వేలంలో మంచి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిన లఖ్​నవూ.. ఈసారి టైటిల్​ ఫేవరేట్లలో ఒకటిగా ఉంది. గతేడాది పంత్​ సారథ్యంలో లీగ్​ దశలో బాగా రాణించిన దిల్లీ క్యాపిటల్స్​.. ప్లేఆఫ్స్​లో చతికిలపడింది. ఈసారి కూడా అదే ఆటతీరును కనబర్చాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. రాజస్థాన్​ రాయల్స్​లో కూడా విదేశీ స్టార్లు సహా ఎందరో మ్యాచ్​విన్నర్లు ఉన్నారు. సంజు శాంసన్​ కెప్టెన్​. కేన్​ విలియమ్సన్​ సారథిగా ఉన్న సన్​రైజర్స్​ హైదరాబాద్​ గతేడాది ఆడిన 14 మ్యాచ్​ల్లో మూడే విజయాలతో.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి మెగా వేలంతో.. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులో వచ్చి చేరారు. ఈసారి ఎలా రాణిస్తుందో మరి? పంజాబ్​ కింగ్స్​కు నుంచి రాహుల్​ బయటకు వచ్చిన అనంతరం.. మయాంక్​ అగర్వాల్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఇతడికి కూడా పెద్దగా సారథిగా అనుభవం లేదు. కొన్నేళ్లుగా అంతలా ఆకట్టుకోలేకపోతున్న పంజాబ్​ను ఈసారి మయాంక్​ ఎలా నడిపిస్తాడో చూడాలి.

దిల్లీ క్యాపిటల్స్​ జట్టు

ఇవీ చూడండి:IPL 2022: లీగ్​లో అత్యధిక పరుగుల వీరులు వీరే!

ఐపీఎల్​లో అత్యధిక శతకాల వీరులు వీరే.. జాబితాలో కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

ధోనీ సారథిగా తప్పుకొన్నా.. చెన్నై జోరు కొనసాగేనా?

ఐపీఎల్​లో విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!

IPL 2022 Delhi Capitals: యువకుల జట్టు కొట్టేనా కప్పు!

IPL 2022: గత సీజన్​లో తేలిపోయారు.. ఈసారి మురిపిస్తారా?

ABOUT THE AUTHOR

...view details