IPL 2022 Rajasthan royals: ఐపీఎల్ తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరింది. ఈ సారి ట్రోఫీని సాధించి షేన్ వార్న్‌కి నివాళి ఇద్దామనుకున్నారు. కానీ అనుకున్నది జరగలేదు. దారుణంగా ఓడిపోయింది. కానీ రెండో మేటి జట్టుగా క్రీడాభిమానుల ప్రేమను పొందింది. ఓ సారి ఆ జట్టు ఓటమికి గల కారణాలేంటో తెలుసుకుందాం..
బట్లర్ ఓ కారణం...టీ20 లీగ్ 2022లో రాజస్థాన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో జాస్ బట్లర్ ఒకటి. సిరీస్ ప్రారంభంలో బట్లర్ బాదుడు చూసి ఈ ఏడాది రాజస్థాన్ టైటిల్ కొట్టేయడం పక్కా అనుకున్నారంతా. అంతలా విరుచుకుపడ్డాడు. నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో సీజన్‌లో 863 పరుగులు చేశాడు బట్లర్. బ్యాటింగ్‌లో ఈ ఏడాది అత్యధికాలు అన్నీ బట్లర్‌వే. అంతలా బలంగా కనిపించిన బట్లరే... బలహీనత కూడా. అందుకే బట్లర్ బాగా ఆడిన మ్యాచ్‌ల్లో గెలవడం, లేదంటే ఓడడం రాజస్థాన్ డైలీ రొటీన్ అయిపోయింది. అలా అని ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలవలేదనుకోండి.
కానీ, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో బట్లర్ బాగా ఆడాల్సి ఉంది. కీలకమైన క్వాలిఫయర్ 2లో బెంగళూరుపై సెంచరీ చేసిన బట్లర్ నుంచి ఫైనల్‌లో అదే ప్రదర్శన ఆశించింది రాజస్థాన్. కానీ ఆఖరి పోరులో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో జట్లు స్కోరు 130 పరుగులకే పరిమితమైపోయింది. బట్లర్ లేదంటే శాంసన్ అన్నట్లుగా ఉన్న రాజస్థాన్ బ్యాటింగ్ వాళ్లిద్దరూ పెవిలియన్‌కి చేరేసరికి.. మిగిలినవాళ్లూ డగౌట్‌కి వచ్చేశారు. రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం బలంగా మారిన బలహీనత అయిన బట్లర్ అని చెప్పొచ్చు. ఒక్కరిద్దరి మీద ఆధారపడితే మ్యాచ్‌లు గెలుస్తారు తప్ప టోర్నీలు కాదని సీనియర్లు ఊరికే చెప్పలేదు.
గుజరాత్ వేగాన్ని ఆపలేక...గుజరాత్ ఈ ఏడాది టాప్ టీమ్‌గా ఫైనల్‌కి చేరిందంటే దానికి కారణాల్లో ఒకటి బౌలింగ్‌లో వైవిధ్యం. జట్టులో 140-150 కి.మీల వేగంతో బంతులేసేవాళ్లు ఉన్నారు. అదే సమయంలో 120 నుంచి 130 మధ్య నిలకడగా బంతులేసేవాళ్లూ ఉన్నారు. కొన్ని పిచ్‌ల మీద ఆ పేస్ వేరియేషన్ చాలా అవసరం. రాజస్థాన్ బౌలర్లలో ఇది కాస్త తక్కువే అని చెప్పొచ్చు. పాండ్య లాంటి మీడియం పేసర్ రాజస్థాన్‌కి లేకపోయాడు. దాంతోపాటు రియాన్ పరాగ్ లాంటి ఆరో బౌలర్ ఆప్షన్ ఉన్నా వాడకపోవడం రాజస్థాన్ చేసిన తప్పు అని కూడా పరిశీలకులు అంటుంటారు.
అశ్విన్ సహకరించి ఉంటే...రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కూడా చేస్తాడని తెలుసు. అలా ఈ ఏడాది తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. టిపికల్ టెయిలెండర్‌లా కాకుండా, సరైన ఆల్‌రౌండర్‌లా ఆడాడు. అయితే ఈ క్రమంలో బౌలింగ్‌లో పట్టుసడలింది అని చెప్పాలి. 17 మ్యాచ్‌ల్లో కేవలం 12 వికెట్లే తీశాడు. ఓవైపు యుజ్వేంద్ర చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచినా.. అతడు విఫలమైనప్పుడు లేదంటే వికెట్లు తీయలేనప్పుడు అశ్విన్ ఓ చెయ్యి వేయాల్సింది. కానీ అశ్విన్ నుంచి ఆ స్థాయి బౌలింగ్ ప్రదర్శన ఈ ఏడాది రాలేదు. పరుగులు నియంత్రించినా వికెట్లు అంతగా తీయలేకపోయాడు.
ఇది కూడా ఓ కారణం...రియాన్ పరాగ్ లాంటి యంగ్ ప్లేయర్ ఉన్నప్పటికీ సంజూ శాంసన్ కీలక సమయాల్లో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆర్డర్‌లో పైకి తీసుకొచ్చి ఆడించాడు. అశ్విన్ మీద నమ్మకం ఒక కారణమైతే.. పరాగ్ ఆట మీద నమ్మకం లేకపోవడమూ ఓ కారణం అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే మిడిలార్డర్‌కి, టెయిలెండర్లకు అనుసంధానంగా ఉండాల్సిన లోయరార్డర్ ఈ సిరీస్‌లో రాజస్థాన్‌కి పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. కరీబియన్ హిట్టర్ హెట్‌మయర్, ఇండియన్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఆశించిన మేర రాణించలేదు. రూ.3.8 కోట్లకు రాజస్థాన్ అతడిని కైవసం చేసుకుంది. కానీ పరాగ్ మాత్రం 132 పరుగులే చేశాడు. మరోవైపు హెట్‌మయర్ 204 పరుగులు చేశాడు. దీంతో జట్టుకు అవసరమైన సాయం చేయలేకపోయారు.
కొత్తగా ట్రై చేసి...2022 ఐపీఎల్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పొట్టి క్రికెట్‌లో ఛేజింగ్ చేయడమే విజయరహస్యం అని ఫ్రాంచైజీలు అనుకోవడమే దీనికి కారణం. కానీ రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫైనల్‌లో అందరి దారిలో వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి చిత్తవుతామనే భయమో లేక పిచ్‌ని సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కానీ... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయిన హార్దిక్ పాండ్యకు ఇది నెత్తిన పాలు పోసినట్లయింది. అవకాశాన్ని గట్టిగా పట్టుకున్న పాండ్య ఆండ్ కో వరుస వికెట్లు తీసి శాంసన్ నిర్ణయం ఎంత తప్పో నిరూపించారు.
కెప్టెన్ లోపం...రాజస్థాన్‌కి సంజూ శాంసన్ 2021లో కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ ఏ మాత్రం కలసి రాలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట గెలిచి ఏడో స్థానంలో నిలిచిపోయింది. అలాంటి జట్లు ఈ ఏడాది రెండో స్థానానికి వచ్చింది. అంటే సంజూ శాంసన్ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. చాలావరకు కూల్ అండ్ కామ్‌గా కనిపించే శాంసన్.. తను ఆడాడు, ఆడించాడు... కానీ జట్టుకు కప్ తీసుకురాలేకపోయాడు. ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలనే అప్రకటిత నియమం పెట్టుకుని, వేరియేషన్లు లేక కొన్ని మ్యాచ్‌లు చేజార్చుకున్నాడు. ఇది కెప్టెన్సీ లోపమే అంటున్నారు క్రీడా పండితులు.
ఇదీ చూడండి: ఐపీఎల్ విన్నింగ్ టీమ్ ప్రైజ్‌మనీ ఎంత? బట్లర్ మాత్రం గంపగుత్తగా కొట్టేశాడుగా..