IPL 2022 RCB Playoffs: భారత టీ20 లీగ్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఫా డుప్లెసిస్ టీమ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్ల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరు అవకాశాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది.
బెంగళూరు ఇప్పుడెలా ఉంది..డుప్లెసిస్ నాయకత్వంలో ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన బెంగళూరు మధ్యలో పలు వైఫల్యాలు చవిచూసింది. తర్వాత కొన్ని విజయాలు సాధించి మళ్లీ టాప్-4లోకి దూసుకొచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేలా కనిపించింది. కానీ, గతరాత్రి పంజాబ్ చేతిలో ఓటమిపాలవ్వడంతో పరిస్థితులు మారాయి. ప్రస్తుతానికి టాప్-4లో ఉన్నా.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో నిలవడంతో 14 పాయింట్లతో కొనసాగుతోంది. అయితే, ఇక్కడ నెట్‌రన్‌రేట్(-0.323)లో చాలా వెనుకపడిపోయింది. అది ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై (-0.181) కన్నా మరీ తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో లీగ్ దశ ముగిసేసరికి.. పరిస్థితులు కఠినంగా మారి నాలుగో స్థానం కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి వస్తే రన్‌రేట్ విషయంలో బెంగళూరు కచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవాలంటే మిగిలి ఉన్న ఒకే ఒక్క మ్యాచ్‌లో సంచలన విజయం సాధించాలి.
ఇతర జట్లు ఎలా ఉన్నాయి..
గుజరాత్:హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ ప్రస్తుతం 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిచినా 22 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో అగ్రస్థానంతోనే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ ఒకటి ఓడి.. ఒకటి గెలిచినా 20 పాయింట్లతో నిలుస్తుంది. లేదా దురదృష్టంకొద్దీ రెండూ ఓడినా ఇప్పటికే 18 పాయింట్లు సాధించడంతో బెర్తు కచ్చితంగా ఉంటుంది.
లఖ్‌నవూ: కేఎల్ రాహుల్ సారథ్యంలోని లఖ్‌నవూ ప్రస్తుతం 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిస్తే 20 పాయింట్లు సాధించనుంది. ఒకవేళ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. పరిస్థితులు ఎదురుతన్ని రెండూ ఓడినా 16 పాయింట్లతో ఉంటుంది. అలాంటప్పుడు లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానమైనా ఎక్కడికీ పోదు.
రాజస్థాన్: సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు సాధించి బెంగళూరుతో సమానంగా ఉంది. అయితే, రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో మూడులో నిలిచింది. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో తనకన్నా తక్కువ పాయింట్లు, రన్‌రేట్‌లో వెనుకపడిపోయిన దిగువ స్థానాల్లో నిలిచిన జట్లకన్నా రాజస్థాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ ఒకటి ఓడినా 16 పాయింట్లు కచ్చితంగా ఉంటాయి. ఎలాగూ రన్‌రేట్ పరంగా బాగుండటంతో మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి.