IPL 2022 Playoffs: ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ బెర్తులపై క్లారిటీ వచ్చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ గెలవడం వల్ల దిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్సీబీకి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. నేడు(ఆదివారం) లీగ్ దశ మ్యాచులు ముగియనుండగా.. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచులకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న గుజరాత్-రాజస్థాన్ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా గార్డెన్స్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా.. అక్కడే బుధవారం రాత్రి 7.30 గంటలకు లఖ్‌నవూ-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
క్వాలిఫయర్-1లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఫైనల్చేరేందుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29న(ఆదివారం) జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
నాలుగేళ్ల క్రితం..శనివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ గెలిచి ఉంటే కచ్చితంగా ప్లే ఆఫ్స్ వెళ్లేది. కానీ ఆ జట్టు ఆశలుపై ముంబయి నీళ్లు చల్లింది. దీంతో ఆర్సీబీకి మేలు జరిగింది. అయితే సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగింది. 2018లో దిల్లీ సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. దిల్లీ.. తమ చివరి మ్యాచ్‌ను ముంబయితో ఆడింది. ఆ మ్యాచ్ రోహిత్ సేనకు చాలా కీలకం. గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఓడితే రాజస్థాన్ అర్హత సాధిస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబయి 19.3 ఓవర్లలో 163 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో ఐదో స్థానంలో నిలిచిన రోహిత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం దిల్లీయే. అలా నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు బంతి ముంబయి కోర్టులో పడింది. దిల్లీ ప్లేఆఫ్స్ చేరకుండా అడ్డుకట వేసింది ఎమ్ఐ. ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు పంపించింది.