IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లు, ఉత్కంఠభరిత ఛేజింగ్‌లు, ఆటగాళ్ల రికార్డు ప్రదర్శనలతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ముగిశాయి. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబయి ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఓసారి కప్ గెలిచిన సన్‌రైజర్స్ 2022 ఐపీఎల్లో ఇంకా ఖాతా తెరవకపోవడం గమనార్హం. చెన్నై ఆడిన మూడింట్లో ఓడగా.. ముంబయి, సన్‌రైజర్స్ రెండేసి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండిట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో కొత్త టీం లఖ్‌నవూ కూడా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో ఓసారి పాయింట్ల పట్టిక చూద్దాం.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఆయా ఆటగాళ్లు వీటిని ధరించాల్సి ఉంటుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. బట్లర్ 3 మ్యాచ్‌ల్లో 102.5 సగటుతో 205 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. 2 మ్యాచ్‌ల్లో 135 పరుగులు చేసిన ముంబయి బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో ఎవరెవరున్నారో ఓసారి చూడండి.
ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగుల వీరులు)
- జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) - 205 (3 మ్యాచ్‌లు)
- ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్) - 135 (2 మ్యాచ్‌లు)
- ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 122 (3 మ్యాచ్‌లు)
- దీపక్ హుడా (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్) - 119 (3 మ్యాచ్‌లు)
- శివం దూబే (చెన్నై సూపర్ కింగ్స్) - 109 (3 మ్యాచ్‌లు)