IPL 2022 MI Vs DC: అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన క్రికెట్ పండగ.. ఐపీఎల్ మొదలైపోయింది. లీగ్ చరిత్రలో అత్యధికంగా ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్‌సేన.. తొలి కప్పు కోసం నిరీక్షణ కొనసాగిస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌తో నేడు (ఆదివారం) తలపడనుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల బలాబలాలు ఏంటో చూసేయండి.
ఆ ఒక్కటి తప్ప:ముంబయిలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను భారీ ధరకు దక్కించుకుంది ముంబయి. సూర్యకుమార్ ఫిట్నెస్ సమస్యతో ఎన్సీఏలో ఉన్నాడు. రోహిత్, ఇషాన్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ వంటి హిట్టర్లతో జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
అయితే ఈ సీజన్‌లో ముంబయిలోని సగం ఆటగాళ్లు పెద్దగా తెలియనివారే. గత సీజన్‌లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడం వల్ల లీగ్ దశకే ముంబయి పరిమితమైంది. పాండ్య సోదరులు, కీరన్ పొలార్డ్ విఫలం కావడం ముంబయికి దెబ్బ పడింది. కానీ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా.. పొలార్డ్‌కు ఉంది. టీమ్‌ఇండియా ప్రధాన పేస్ బౌలర్ బుమ్రా నేతృత్వంలోనే ముంబయి పేస్ బౌలింగ్ దళం ఉండబోతోంది. బుమ్రా కాకుండా జోఫ్రా ఆర్చర్, జయ్‌దేవ్ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్, బాసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మురుగన్ అశ్విన్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరికి అంతర్జాతీయ అనుభవం తక్కువ.
తెలివైన ధోరణిలో..:ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది దిల్లీ. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు భారీ మొత్తం వెచ్చించింది. హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, సారథిగా ఫ్రాంఛైజీకి టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌ను రూ.6.50 కోట్లకు సొంతం చేసుకొంది. అండర్ -19 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన యువ భారత సారథి యష్ ధుల్ సహా స్పిన్నర్ విక్కీని దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. బ్యాటింగ్ పరంగా దిల్లీకి పెద్దగా ఇబ్బంది లేదు. గత సీజన్ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్‌కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఆ తర్వాత రోవ్‌మన్ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్/కేఎస్ భరత్/సీఫెర్ట్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరుసగా బ్యాటింగ్ చేయగలరు.