IPL 2022 LSG vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డారు. లఖ్‌నవూ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప పరుగుల వరద పారించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సుతో 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చి మొయిన్ అలీ(22 బంతుల్లో 35) సైతం ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శివమ్ దుబె(30 బంతుల్లో 49), అంబయి రాయుడు(27), రవీంద్ర జడేజా(17), ఆఖర్లో ధోనీ(16) రాణించడం వల్ల.. చెన్నై భారీ స్కోరు సాధించింది. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు 79 పరుగులు పిండుకుంది. మొత్తం 7 వికెట్లు కోల్పోయింది.
ఇక, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్.. ఏ దశలోనూ ప్రభావవంతంగా కనిపించలేదు. ఆ జట్టు ఆటగాళ్లు పలు క్యాచ్‌లను వదిలేయడం, ఫీల్డింగ్ తప్పిదాలు చెన్నై బ్యాటర్లకు కలిసొచ్చింది. యువ బౌలర్ రవి బిష్ణోయ్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఆండ్రూ టై తలో రెండు వికెట్లు పడగొట్టారు.