గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను లఖ్‌నవూ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. దీంతో రాహుల్ బృందం.. మయాంక్ సేనపై 20 పరుగుల తేడాతో గెలిచింది. బౌలంగ్‌లో సత్తా ఉండాలే కానీ, ఎలాంటి మ్యాచ్‌నైనా సొంతం చేసుకోవచ్చని ఈ పోరు ద్వారా మరోసారి నిరూపితమైంది. కాగా, ఈ సీజన్‌లో 'డ్యూ' ప్రభావం అధికంగా ఉండటంతో చాలా జట్లు భారీ స్కోర్లను సైతం అలవోకగా ఛేదించగా.. మరికొన్ని జట్లు మోస్తరు లక్ష్యాలను కూడా చేరలేక చతికిల పడుతున్నాయి. దీనికి కారణం మెరుగైన బౌలింగ్ సహా పిచ్ పరిస్థితులు కలిసొస్తుండటం. ఈ నేపథ్యంలో ఓ సారి ఈ సీజన్‌లో సాధారణ స్కోర్లను కూడా కాపాడుకున్న జట్లు, వాటి విశేషాలు తెలుసుకుందాం.
చాహల్, బౌల్ట్ మాయాజాలం..ఈ సీజన్‌లో తొలిసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు రాజస్థాన్. లఖ్‌నవూతో ఆడిన తన నాలుగో మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ మాయాజాలంతో రాజస్థాన్ 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 165/6 స్కోర్ సాధించింది. టాప్ ఆర్డర్ విఫలమైనా మధ్యలో షిమ్రన్ హెట్‌మెయిర్ (59*), అశ్విన్ (28) ఆదుకున్నారు. అయితే, లఖ్‌నవూ అంతకుముందే చెన్నైపై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఇదేం పెద్ద స్కోర్ కాదనుకున్నారు. కానీ, చాహల్ 4/41, ట్రెంట్ బౌల్ట్ 2/30 విజృంభించడంతో లఖ్‌నవూ 162/8 స్కోరుకే పరిమితమైంది. ఈ స్టేడియంలోని బౌండరీ లైన్ దగ్గరగా ఉండటంతో పరుగుల వరద పారించొచ్చు. అందువల్లే ఇక్కడ సగటు స్కోర్ 180పైనే నమోదవుతుంది. అలాగే ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. కానీ, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిందంటే అందుకు రాజస్థాన్ బౌలింగే కారణం.
షమి, రషీద్‌ఖాన్ ఆదుకున్నారు..ఇక ఈ సీజన్‌లో రెండోసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు గుజరాత్. కోల్‌కతాతో ఆడిన తన ఏడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 156/9 స్కోరే సాధించింది. డీవైపాటిల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (67) మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఈ పిచ్‌పై సగటు స్కోర్ 160 నుంచి 170 మధ్య నమోదవుతుంది. అయినా, గుజరాత్ తక్కవ స్కోరుకే పరిమితమవడంతో కోల్‌కతా తేలిగ్గానే ఛేదించేస్తుందనే నమ్మకం కలిగింది. అంతకుముందే ఆ జట్టు 170, 180, 200 స్కోర్లు సాధించింది. దీంతో కోల్‌కతా విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ, గుజరాత్ బౌలర్లు షమి 2/20, రషీద్ ఖాన్ 2/22, దయాల్ 2/42 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 148/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో గుజరాత్ 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ పిచ్ నెమ్మదైందే అయినా గుజరాత్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగిందే.