IPL 2022 KL Rahul News: టీమ్ఇండియా యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అతడికి గొప్ప భవిష్యత్ ఉందని పేర్కొన్నాడు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ నాయకత్వ పటిమపై ఓ అంచనాకు రావడం సరికాదని అన్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగు పెట్టనున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నిరంతర ప్రక్రియ..
Gambhir On KL Rahul: 'గెలుపోటములను సమానంగా స్వీకరించడమే నాయకుడి లక్షణం. విజయం సాధిస్తే ఉప్పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం రాహుల్‌కి తెలియదు. అతడిలోని గొప్ప లక్షణం కూడా ఇదే. కెప్టెన్సీ అనేది ఒక్క రోజులో నేర్చుకుంటే వచ్చేది కాదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతి రోజూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించాలి. అప్పుడే అత్యుత్తమంగా రాణించగలం. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్ని సాధించేశామని గొప్పలు చెప్పుకోవడం కూడా సరికాదు. రాహుల్‌కి బ్యాటర్‌గానే కాకుండా, నాయకుడిగానూ గొప్ప భవిష్యత్తు ఉంది. అతడు చాలా ప్రశాంతంగా, ఆట పట్ల నిబద్ధతతో ఉంటాడు. అలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే, అతడి విషయంలో ఇంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం సరికాదు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను బట్టి అతడి నాయకత్వ పటిమను అంచనా వేయలేం' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.