Dewald Brevis No Look Six: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ముంబయి ఇన్నింగ్స్ స్లోగా ఆరంభించినా.. ఆఖర్లో దంచికొట్టింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆఖర్లో దూకుడుగా ఆడారు. అయితే.. ఆ కుర్రాడి ఆట ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే రోహిత్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 6 పరుగులే. ఒత్తిడిలో క్రీజులోకి వచ్చాడు బేబీ డివిలియర్స్‌గా పిలుచుకునే సౌతాఫ్రికా స్టార్ డెవాల్డ్ బ్రెవిస్. అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన బ్రెవిస్‌కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. అయినా చక్కటి షాట్లతో అలరించాడు. కమిన్స్, ఉమేశ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను ఎదుర్కొని నిలిచాడు. 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
అయితే.. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతికి డెవాల్డ్ ఆడిన షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. నో లుక్ సిక్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. వరుణ్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్‌లోని తరలించి కనీసం చూడకపోవడం విశేషం. బంతి గమనాన్ని చూడకుండానే.. అది కచ్చితంగా సిక్స్ వెళ్తుందని అతనికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. నో లుక్ సిక్స్‌గా పిలిచే వీటిపై నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు డెవాల్డ్. గతంలో సంబంధిత వీడియోలను కూడా ముంబయి ఇండియన్స్ పోస్ట్ చేసింది.
ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో.. బ్రెవిస్ 506 పరుగులు చేశాడు. 18 ఏళ్ల నాటి శిఖర్ ధావన్ రికార్డును బద్దలుకొట్టి.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2004లో అంబటి రాయుడు కెప్టెన్సీలో ధావన్ 505 పరుగులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు దాన్నే బేబీ డివిలియర్స్ అధిగమించాడు. మరోవైపు మెగా వేలంలో ఈ యువ ప్రతిభావంతుడిని తీసుకొనేందుకు తొలుత చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపించాయి. అయితే, చివరికి రూ. 3 కోట్లకు ముంబయి దక్కించుకుంది.
బేబీ ఏబీ.. ఒకే స్కూల్.. ఒకే జెర్సీ నెం: అతడిని బేబీ డివిలియర్స్‌గా ఎందుకు పిలుస్తారంటే.. అతడు అచ్చం దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తలపించేలా బ్యాటింగ్ చేస్తాడు. దీంతో అతడికి ఆ పేరు వచ్చింది. అలాగే అతడికి ఐపీఎల్‌లో డివిలియర్స్ ఆడిన ఆర్సీబీ జట్టంటే చాలా ఇష్టం. ఆ జట్టులో ఆడాలనే కోరిక ఉందని ఇటీవల ప్రపంచకప్ సమయంలో వెల్లడించడం గమనార్హం.