తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​కు గాయాల దెబ్బ.. టోర్నీ నుంచి ఔటైన ఆటగాళ్లు వీళ్లే! - ఐపీఎల్​ న్యూస్​

IPL 2022 Injury News: ఐపీఎల్​ను గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. టోర్నీ ఆరంభానికి ముందే పలువురు ఆటగాళ్లను కోల్పోయాయి జట్లు. తాజాగా సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాడు వాషింగ్టన్ సుందర్​ సైతం గాయపడ్డాడు. దీంతో మిగతా మ్యాచులు ఆడేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టోర్నీ నుంచి దూరమైన వారు ఎవరో చూద్దాం.

IPL 2022 Injury News
IPL 2022 Injury News

By

Published : May 4, 2022, 7:36 AM IST

IPL 2022 Injury News: క్రికెట్‌లో గాయపడటం సర్వసాధారణం. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ చేసేటప్పుడు చిన్నపాటి గాయాలు అవుతుంటాయి. అయితే ఆ చిన్న గాయాలే సిరీస్‌లను కోల్పోయేలా చేస్తుంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గాయంతో ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన సుందర్‌.. మరోసారి గాయపడ్డాడు. దీంతో మిగిలిన మ్యాచుల్లో ఆడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఇటువంటి కారణంతో సీజన్‌కు దూరమయ్యారు. మరి వారు ఎవరు..? ఆ జట్లపై ప్రభావం ఎలా ఉందో విశ్లేషిద్దాం..

వాషింగ్టన్ సుందర్​

దీపక్‌ చాహర్‌ - ఆడమ్‌ మిల్నే: మెగా వేలంలో భారీ మొత్తం (రూ.14 కోట్లు) పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్‌ సేవలను చెన్నై కోల్పోయింది. వెస్డిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ నుంచి తొడ కండరాల గాయంతో అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకున్నాడు. తొడ కండరాల నొప్పి తగ్గినా వెన్నునొప్పి తిరగబెట్టిందని వైద్యులు వెల్లడించారు. దీంతో టీ20 లీగ్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఫాస్ట్‌బౌలర్‌ ఆల్‌రౌండర్‌ లేని లోటు చెన్నై జట్టులో కనిపించింది. తొమ్మిది మ్యాచుల్లో కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించింది. విదేశీ పేసర్ ఆడమ్‌ మిల్నే కూడా మోకాలి గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో లంక స్పిన్నర్‌ మహీషా తీక్షణను చెన్నై తీసుకుంది. ఇప్పటి వరకు బౌలింగ్‌ పరంగా తీక్షణ అదరగొట్టేస్తున్నాడు. బౌలింగ్‌లో 7.54 ఎకానమీ రేట్‌తో ఎనిమిది వికెట్లను పడగొట్టాడు.

దీపక్​ చాహర్​

మార్క్‌వుడ్‌:ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ను కొత్త జట్టు లఖ్‌నవూ రూ.7.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌కూడానూ ఆడకుండానే సీజన్‌ను తప్పుకోవాల్సి వచ్చింది. మోచేతి గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో లఖ్‌నవూ ఆండ్రూ టైని ఎంచుకుంది. అయితే ఆండ్రూ టై మూడు మ్యాచ్‌లను ఆడి కేవలం రెండు వికెట్లను మాత్రమే తీశాడు. బౌలింగ్‌ ఎకానమీ రేటు (9.73) కూడా బాగా ఎక్కువే.

నాథన్‌ కౌల్టర్‌ నైల్

నాథన్‌ కౌల్టర్‌ నైల్ :హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన రాజస్థాన్‌ బౌలర్‌ నాథన్ కౌల్టర్ నైల్ సీజన్‌కు దూరమయ్యాడు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన నైల్‌ తొడ కండరాలు పట్టేయడం వల్ల పూర్తి చేయకుండానే వైదొలిగాడు. ఇక అప్పటి నుంచి కోలుకోలేకపోవడం వల్ల సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. మెగా వేలంలో నాథన్‌ను రాజస్థాన్‌ రూ. 2 కోట్లకే దక్కించుకుంది. అతడి స్థానంలో రాజస్థాన్‌ ఎవరినీ తీసుకోలేదు. హైదరాబాద్‌పై వికెట్లేమీ తీయని కౌల్టర్ నైల్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన నైల్ 48 పరుగులు ఇచ్చాడు.

లవ్‌నిత్‌ సిసోడియా

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌: బెంగళూరు కేవలం రూ. 20 లక్షలకే దక్కించుకున్న అన్‌క్యాప్‌డ్ ఆటగాడు లవ్‌నిత్‌ సిసోడియా గాయం కారణంగా టీ20 లీగ్‌ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వికెట్‌ కీపర్‌ అయిన సిసోడియాకు అయిన గాయంపై స్పష్టత లేదు. సిసోడియా స్థానంలో రాజత్‌ పాటిదార్‌ను బెంగళూరు ఎంపిక చేసుకుంది. రెండు మ్యాచ్‌లను ఆడిన పాటిదార్‌ 141.67 స్ట్రైక్‌ రేట్‌తో 68 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధశతకం (52) ఉండటం విశేషం. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ వస్తూ అనుభవజ్ఞుడిగా పరుగులు రాబడుతున్నాడు. సిసోడియాకు అవకాశం వస్తుందో లేదో కానీ పాటిదార్‌ మాత్రం వచ్చిన ఛాన్స్‌ను చక్కగా వినియోగించుకుంటున్నాడు.

జేసన్​ రాయ్​

బయోబబుల్‌లో ఉండలేక: బయోబబుల్‌ నిబంధనలను అనుసరిస్తూ రెండు నెలలపాటు గడపటం ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో జాసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్ సీజన్‌ నుంచి దూరం కావడం గమనార్హం. హార్డ్‌ హిట్టర్‌ అయిన రాయ్‌ను మెగావేలంలో గుజరాత్‌ కేవలం రూ. 2 కోట్లకే దక్కించుకుంది. రాయ్‌ స్థానంలో అఫ్గానిస్థాన్‌కు చెందిన రహ్‌మనుల్లా గుర్బాజ్‌ను రిప్లేస్‌ చేసింది. అదేవిధంగా ఇంగ్లాండ్‌కే చెందిన అలెక్స్ హేల్స్‌ను కోల్‌కతా రూ. 1.20 కోట్లకే సొంతం చేసుకుంది. అయితే హేల్స్ కూడా బయో బబుల్‌లో ఉండలేనని సీజన్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దీంతో కోల్‌కతా అతడి స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ను తీసుకుంది. నాలుగు మ్యాచ్‌లను ఆడిన ఆరోన్ ఫించ్‌ ఒక అర్ధ శతకం (58) చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ మినహా మిగిలిన మూడు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు.

ఇదీ చదవండి:ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్​లో మార్పులు.. ఏ మ్యాచ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details