IPL 2022 Gujarat player Sai Sudarshan: తండ్రి.. దక్షిణాసియా సమాఖ్య క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఒకప్పటి అథ్లెట్. తల్లి.. జాతీయ స్థాయిలో రాష్ట్రం తరపున వాలీబాల్‌లో తలపడింది. ఇప్పుడు వీళ్ల తనయుడు.. టీ20 మెగా లీగ్ 15వ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ తరపున అదరగొడుతున్నాడు. ఆ తండ్రేమో భరద్వాజ్.. ఆ తల్లి పేరు ఉష.. ఇక ఆ క్రికెటర్ 20 ఏళ్ల సాయి సుదర్శన్. తమిళనాడుకు చెందిన ఈ యువ బ్యాటర్.. తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నపుడు అజేయ అర్ధశతకంతో పోరాడాడు. తన బ్యాటింగ్‌తో అలరించాడు. వివిధ వయసు విభాగాల క్రికెట్లో సత్తాచాటి.. అనంతరం తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో చెలరేగి.. ఆ తర్వాత రాష్ట్రం తరపున దేశవాళీల్లో రాణించి.. ఇప్పుడు ఈ మెగా లీగ్‌లో జోరు కొనసాగిస్తున్నాడు.
IPL 2022: ఎవరీ సుదర్శన్.. మెగాలీగ్‌లో అదరగొడుతున్నాడుగా! - Gujarat player Sai Sudarshan home town
IPL 2022 Gujarat player Sai Sudarshan: టీ20 మెగా లీగ్ 15వ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ తరపున ఆడుతున్న తమిళనాడు యువ బ్యాటర్ సుదర్శన్ మంచి ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడి క్రికెట్ జర్నీ గురించే ఈ కథనం..

2021 టీఎన్‌పీఎల్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 71.60 సగటుతో 358 పరుగులు చేసిన అతను.. ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఆ ప్రదర్శనతోనే తమిళనాడు రాష్ట్ర జట్టుకు ఎంపికై సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో తన నైపుణ్యాలను చాటాడు. రంజీ జట్టుకూ ఎంపికయ్యాడు. ఈ ఏడాది మెగా వేలంలో తన కనీస ధర రూ.20 లక్షలకే సుదర్శన్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. వెన్నునొప్పితో విజయ్ శంకర్ దూరమవడంతో పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో మెగా క్రికెట్ లీగ్ అరంగేట్రం చేసిన అతను 35 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ( హైదరాబాద్‌పై 11, బెంగళూర్‌పై 20) పెద్దగా రాణించలేకపోయాడు. ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చి పంజాబ్‌తో రెండో మ్యాచ్‌లో అజేయంగా 65 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. రబాడ, అర్ష్‌దీప్ సింగ్ లాంటి పేసర్లను సమర్థంగా ఎదుర్కొని మెప్పించాడు. దీంతో ఇప్పుడీ యువ క్రికెటర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 16 ఏళ్ల వయసులోనే సుదర్శన్‌ను చూసి, అతను భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరతాడనుకున్నానని తమిళనాడు సహాయక కోచ్ ప్రసన్న వెల్లడించాడు. "అయిదేళ్ల క్రితం అండర్-16 శిక్షణ శిబిరంలో సాయిని చూశా. అతనిలో పరుగులు చేసే సత్తా ఉందని అనుకున్నా. టీఎన్‌పీఎల్ రూపంలో తన సత్తాచాటేందుకు మంచి వేదిక దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు" అని అతను పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'కోహ్లీ.. ఫామ్ సంగతి పక్కన పెట్టి మరో ఇద్దరు పిల్లలను కను'