IPL 2022: ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు ఒకటైతే.. నాలుగు సార్లు గెలిచిన జట్టు మరొకటి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ జట్టు ఐపీఎల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎనిమిది జట్లతో హోరాహోరిగా కొనసాగుతున్న ఐపీఎల్‌లోకి ఈసారి మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇచ్చాయి. మరి వీటిలో ఏ జట్లకు ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉందో చూడండి.
1.చెన్నై సూపర్ కింగ్స్
నాలుగు సార్లు టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. మరో టైటిల్ కోసం సిద్ధమవుతోంది. ఈ జట్టుకు ప్రధాన బలం మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వమే. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్లు సీఎస్కే సొంతం. గతేడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న రుత్‌రాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లతో ఉన్న చెన్నై ప్లేఆఫ్‌కు చేరడం కష్టమైన పని కాదు. అయితే దీపక్ చాహర్ లాంటి ప్రధాన బౌలర్ ఈ సీజన్ మొత్తానికీ దూరమైతే జట్టుపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
2.దిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ల రూపంలో ప్రధాన ఆటగాళ్లను కోల్పోయినా.. దిల్లీ క్యాపిటల్స్ బలంగానే కనిపిస్తోంది. 2020లో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు.. ఈ సారి జరిగిన మెగావేలంతో మరింత పటిష్ఠంగా మారింది. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్ చేయనున్నాడు. రిషభ్ పంత్, మిచెల్ మార్ష్‌లతో మిడిల్ ఆర్డర్ దృఢంగా ఉండగా... బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, రెహ్మన్లతో జట్టు సమతూకంగా కనబడుతోంది.