IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభమైంది. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్‌ను కూడా ఆడేశాయి. అయినప్పటికీ పలువురు స్టార్ ఆటగాళ్లు ఇంకా తమ తమ జట్లలో చేరలేదు. వాళ్లు లేని లోటు ఆయా జట్లు ఆడిన తొలి మ్యాచుల్లో స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. తాజాగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల అభిమానులకు శుభవార్త అందింది. ఈ మూడు జట్ల కీలక ఆటగాళ్లు ఆయా జట్లలో చేరుతున్నారు.
సూర్యకుమార్ క్వారంటైన్ పూర్తి:వెస్టిండీస్‌తో సిరీస్‌లో గాయపడిన ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ సిరీస్‌తో పాటు శ్రీలంకతో జరిగిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కోలుకోవడానికి సమయం పట్టడం వల్ల ఐపీఎల్‌లో ముంబయి ఆడిన తొలి మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకుని ఆలస్యంగా జట్టులో చేరిన సూర్యకుమార్ యాదవ్ తాజాగా క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో ముంబయి ఇండియన్స్ ఆడనున్న రెండో మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 115 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ యాదవ్ 28 సగటుతో 2341 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 82 పరుగులుగా ఉంది.
ఇండియాకు రానున్న మాక్స్‌వెల్:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా గురువారం ఇండియాకు రానున్నాడు. అయితే నిబంధనల ప్రకారం అతడు మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఇక, ఆర్సీబీ ఏప్రిల్ 5న ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో మాక్స్‌వెల్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లీగ్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. కాగా తన పెళ్లి కారణంగా మాక్స్‌వెల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 97 మ్యాచులు ఆడిన మాక్స్‌వెల్ 25 సగటుతో 2018 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 95 పరుగులుగా ఉంది. బౌలర్‌గా 22 వికెట్లు తీశాడు.
రానున్న బెయిర్‌స్టో:ఇక పంజాబ్ కింగ్స్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో కూడా మంగళవారం ఇండియాకు రానున్నాడు. అతడు కూడా నిబంధనల ప్రకారం మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు. దీంతో ఏప్రిల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనున్న మ్యాచుకు కూడా బెయిర్‌స్టో దూరం కానున్నాడు. ఇంగ్లండ్ జట్టు.. వెస్టిండీస్ పర్యటన కారణంగా బెయిర్‌స్టో ఐపీఎల్‌లో చేరడానికి కాస్త ఆలస్యమైంది. లీగ్ చరిత్రలో 28 మ్యాచ్‌లాడిన బెయిర్‌స్టో 41 సగటుతో 1038 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉండగా.. అత్యధిక స్కోర్ 114 పరుగులుగా ఉంది.
ఇదీ చదవండి:'కెప్టెన్‌గా తప్పుకుంటానని ధోనీ.. నాకు ముందే చెప్పాడు'