IPL 2022 Final Match: ఐపీఎల్-2022 చివర దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. మే 29న రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ఆరంభించనున్నట్లు సమాచారం.
కరోనా వల్ల గత రెండేళ్లుగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. ఈ సీజన్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, స్టార్ హీరో రణ్వీర్ సింగ్లతోపాటు ప్రముఖ బాలీవుడ్ తారలతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మ్యాచ్ వేళలో మార్పు చేసినట్లు క్రిక్‌బజ్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా సవరించింది. మే 24 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్ క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనుండగా.. అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్-2, ఫైనల్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది లీగ్‌లో చేరిన కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు అద్భుతమైన ప్రదర్శనలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.