IPL 2022: ఐపీఎల్‌లో అభిమానులు ఆశించేది ధనాధన్ బ్యాటింగ్. క్రీజులో ఉన్నది యవకుడా అనుభవజ్ఞుడా అనేది చూడరు. బంతిని బౌండరీ దాటించాడా లేదా.. సిక్సర్ల మోత మోగించాడా లేదా.. అనేవే లెక్కేసుకుంటారు. అలా వీలైనన్ని తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన వారే హీరోలుగా మిగులుతారు. మరికొద్ది రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అతితక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు, అందులోనూ అర్ధశతక రికార్డులు నెలకొల్పిన టాప్ బ్యాటర్లు ఎవరో ఓసారి లుక్కేద్దాం.
కేఎల్ రాహుల్ విధ్వంసం..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ అందరికన్నా ముందున్నాడు. అతడు 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాలుగేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో పంజాబ్ జట్టు తరఫున ఆడిన అతడు దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు.
యూసుఫ్ పఠాన్ మెరుపుల్..
ఇక ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2014లో అతడు కోల్‌కతా తరఫున ఆడగా సన్‌రైజర్స్‌తో తలపడిన ఓ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రాహుల్ 2018లో ఈ రికార్డును బద్దలుకొట్టనంత వరకూ యూసుఫ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 22 బంతుల్లో.. 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మొత్తం 72 పరుగులు సాధించాడు.
సునీల్ నరైన్ దంచికొట్టుడు..
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతడు కూడా యూసుఫ్ లానే 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 2017లో బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అందులో మొత్తం 17 బంతులు ఎదుర్కొని.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మొత్తం 54 పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
సురేశ్ రైనా చితకబాదుడు..
ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లో సురేశ్ రైనా ఒకడు. అతడు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 2014లో చెన్నై తరఫున ఆడిన అతడు పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఆటగాడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 25 బంతులు ఎదుర్కొన్న రైనా.. 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మొత్తం 87 పరుగులు చేశాడు. అంటే ఈ జాబితాలో తక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ ఈ చెన్నై మాజీ ప్లేయర్ రికార్డు నెలకొల్పాడు.
ఇషాన్ కిషన్ వీర బాదుడు..
ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచన ఆటగాడు ముంబయి బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్. అతడు గతేడాది సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి రైనా తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఆడిన ఇషాన్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మొత్తం 84 పరుగులు చేశాడు. దీంతో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన వారిలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా దంచికొట్టడం వల్లే ముంబయి ఈసారి వేలంలో రూ.15.25 కోట్ల అత్యధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
* 17 @ 9:ఇక 17 బంతుల్లో అర్ధ శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అందులో క్రిస్‌గేల్, హార్దిక్ పాండ్య, కీరణ్ పొలార్డ్, ఆడం గిల్‌క్రిస్ట్, క్రిస్‌మోరిస్, నికోలస్ పూరన్‌తో పాటు.. ఇషాన్, పొలార్డ్, నరైన్ రెండో సారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అలాగే 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వారిలో పృథ్వీ షా, రిషభ్ పంత్, జోస్ బట్లర్ చోటు సంపాదించుకున్నారు.
ఇదీ చదవండి: IPL 2022 Punjab: పంజాబ్ ఈ సారైనా కప్పు కొట్టేనా?