తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022 Delhi Capitals: యువకుల జట్టు కొట్టేనా కప్పు! - వార్నర్​ న్యూస్​

IPL 2022 Delhi Capitals: గత మూడు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత.. 2020లో రన్నరప్‌.. జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లు.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠం.. కానీ ఇప్పటివరకూ టైటిల్‌ కల మాత్రం నెరవేరలేదు. ఐపీఎల్‌లో తొలి కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఆ జట్టే.. దిల్లీ క్యాపిటల్స్‌. ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని మూడు జట్లలో ఒకటైన దిల్లీ.. ఈ సారి ఆ ముద్ర చెరిపేసుకోవాలనే పట్టుదలతో ఉంది. కొత్త ఆటగాళ్లతో సరికొత్త ప్రదర్శనతో.. ఇది కొత్త దిల్లీ అనే జట్టు నినాదాన్ని నిజం చేసే దిశగా సాగేందుకు సిద్ధమవుతోంది.

IPL 2022
Delhi Capitals

By

Published : Mar 22, 2022, 6:43 AM IST

IPL 2022 Delhi Capitals: ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కల దిశగా వేట కొనసాగిస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌కు మరో అవకాశం వచ్చింది. దిల్లీ డేర్‌డేవిల్స్‌ పేరును 2019లో దిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుని.. జట్టులో, కోచింగ్‌ సిబ్బందిలో మార్పులు చేసుకుని తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జట్టు ఈ సారి అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. రిషబ్‌ పంత్‌ (రూ.16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), అన్రిచ్‌ నోకియా (రూ.6.5 కోట్లు)లను అట్టిపెట్టుకున్న జట్టు మెగా వేలంలో ప్రత్యేక వ్యూహంతో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకుంది. ఆల్‌రౌండర్లపై ప్రత్యేక దృష్టి సారించి.. శార్దూల్‌ ఠాకూర్‌ (రూ.10.75 కోట్లు), మిచెల్‌ మార్ష్‌ (రూ.6.5 కోట్లు), రోమన్‌ పావెల్‌ (రూ.2.8 కోట్లు)లను తీసుకుంది. తన ఆటతోనే కాదు వ్యక్తిత్వంతోనూ అభిమానుల హృదయాలు దోచుకుంటున్న వార్నర్‌ (రూ.6.25 కోట్లు)ను సరసమైన ధరకే దక్కించుకుంది. నిలకడగా రాణిస్తున్న దిల్లీ ఈ సారి కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే వరుసగా నాలుగో ఏడాదీ ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. కానీ కప్పు కొట్టాలంటే మాత్రం.. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలయ్యే అలవాటును మార్చుకోవాలి.

బలాలు

రిషభ్​ పంత్‌

విధ్వంసక బ్యాటింగ్‌ లైనప్‌ దిల్లీకి అతిపెద్ద బలం. పృథ్వీ షా, వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, పంత్‌, పావెల్‌, అక్షర్‌.. ఈ బ్యాటర్లందరూ భారీషాట్లతో క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే సమర్థులే. గత కొన్ని సీజన్లుగా దిల్లీ తరపున ఓపెనర్‌గా పృథ్వీ షా సత్తా చాటుతున్నాడు. ఇక వార్నర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున అతను విఫలమైనప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌లో ఫామ్‌ అందుకుని ఆ ఫార్మాట్లో ఆసీస్‌ను తొలిసారి విశ్వ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. మార్ష్‌ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టుల్లోనే టీ20 ఆట ఆడే పంత్‌.. పొట్టి ఫార్మాట్లో ఏ రకంగా చెలరేగుతాడు. అతని ఒంటి చేతి సిక్సర్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. శార్దూల్‌, పావెల్‌, అక్షర్‌, మార్ష్‌ రూపంలో ఆల్‌రౌండర్ల బలం కావాల్సినంత ఉంది. కొన్ని సీజన్లుగా దిల్లీ విజయవంతమైన బౌలర్‌గా కొనసాగుతున్న పేసర్‌ నోకియా.. గాయం కారణంగా లీగ్‌లో ఆడడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అతను జట్టుతో చేరడం వల్ల ఇప్పుడు బౌలింగ్‌ విభాగం కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది. అతనితో పాటు ఎంగిడి, ముస్తాఫిజుర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శార్దూల్‌, చేతన్‌ సకారియా, నాగర్‌కోటి లాంటి పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, స్పిన్నర్‌ విక్కీ ఆసక్తి కలిగిస్తున్నారు. అవకాశం వస్తే ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్‌ భరత్‌, అశ్విన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. పాంటింగ్‌, అగార్కర్‌, ప్రవీణ్‌ ఆమ్రె, వాట్సన్‌, జేమ్స్‌ హోప్స్‌.. ఈ కోచింగ్‌ విభాగం దిల్లీకి అండ అనడంలో సందేహం లేదు.

బలహీనతలు

డేవిడ్ వార్నర్​

కాగితం మీద చూడడానికి అన్ని రకాలుగా బలంగా ఉన్న దిల్లీకి ఆరంభ దశలో కొన్ని మ్యాచ్‌ల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి రెండు మ్యాచ్‌లకు వార్నర్‌, మూడు మ్యాచ్‌లకు మార్ష్‌ దూరం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌ జట్లలో భాగమైన ఎంగిడి, ముస్తాఫిజుర్‌ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. నోకియా ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి. కొన్ని మ్యాచ్‌లకు అతనూ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక యోయో టెస్టు విఫలమైన పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. పావెల్‌ కూడా గాయపడ్డాడనే వార్తలొస్తున్నాయి. ఈ ఆటగాళ్ల గైర్హాజరీతో జట్టు కూర్పు సమస్యగా మారనుంది. వీళ్లు అందుబాటులో వచ్చాక జట్టు పటిష్ఠంగా మారుతుంది కానీ ఆలోపు కూర్పు కుదరక ఆరంభంలో ఓటమిపాలైతే అది మిగతా మ్యాచ్‌లపై ప్రభావం చూపే ఆస్కారముంది. మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నిర్మించే ఆటగాడు కనిపించడం లేదు. ఇక భారీ ధర పలికిన శార్దూల్‌ ఒత్తిడికి గురై చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోతే అది జట్టుకు ఇబ్బందే. స్పిన్‌ భారమంతా అక్షర్‌పైనే పడొచ్చు. కుల్‌దీప్‌ కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేని పంత్‌.. షాట్ల ఎంపికలో జాగ్రత్తపడాలి. గతేడాది కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి మెప్పించిన అతనికి.. ఈ సారి కొత్త జట్టును నడపడం సవాలే. నోకియాకు ప్రత్యామ్నాయంగా బలమైన విదేశీ పేసర్‌ లేకపోవడం కూడా లోటే.

దేశీయ ఆటగాళ్లు:పంత్‌, అశ్విన్‌ హెబ్బర్‌, మన్‌దీప్‌ సింగ్‌, పృథ్వీ షా, కేఎస్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌, కమలేష్‌ నాగర్‌కోటి, లలిత్‌ యాదవ్‌, ప్రవీణ్‌ దూబె, రిపల్‌ పటేల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, విక్కీ ఓస్త్‌వాల్‌, యశ్‌ ధుల్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌, ఖలీల్‌ అహ్మద్‌
విదేశీయులు: వార్నర్‌, పావెల్‌, సీఫర్ట్‌, మిచెల్‌ మార్ష్‌, నోకియా, ఎంగిడి, ముస్తాఫిజుర్‌
కీలక ఆటగాళ్లు: పంత్‌, వార్నర్‌, నోకియా, పృథ్వీ షా, శార్దూల్‌, అక్షర్‌.
ఉత్తమ ప్రదర్శన: 2020లో రన్నరప్‌

ఇదీ చదవండి:Ipl 2022: లీగ్​లో అత్యధిక పరుగుల వీరులు వీరే!

ABOUT THE AUTHOR

...view details