IPL 2022 CSK VS RCB strengthness: ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగింటిలో మూడు విజయాలతో దూసుకుపోతోంది. దీంతో మంగళవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు జట్ల బలాబలాలు చూస్తుంటే బెంగళూరు విజయానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
డుప్లెసిస్ కీలకం..దశాబ్ద కాలం పాటు చెన్నై జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా రాణించిన ఫాఫ్ డుప్లెసిస్ ఈసారి మెగా వేలంలో బెంగళూరు గూటికి చేరాడు. మరోవైపు ఇక్కడ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడం వల్ల ఆ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో బెంగళూరును నడిపిస్తున్నాడు. అయితే, డుప్లెసిస్‌కు సుదీర్ఘకాలం చెన్నైలో ఆడిన అనుభవం ఉండటం వల్ల ప్రత్యర్థులపై ఆ జట్టు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే విషయాలపై కచ్చితమైన అవగాహన ఉండే అవకాశం ఉంది. దీంతో విరాట్ కోహ్లీని ఎలా నియంత్రించాలనేదానిపై చెన్నై ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్న విషయంపైనా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఎలాంటి సలహాలు ఇస్తాడనేది కీలకం కానుంది.