IPL 2022 CSK vs KKR: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ పండగ రానే వచ్చింది. సరికొత్తగా అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ముస్తాబైంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి పోరు జరగనుంది. కొత్త జట్ల రాకతో ఈ సీజన్ మరింత సందడిగా మారనుంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఈ రోజు జరుగనున్న ఆరంభ మ్యాచ్ ద్వారా.. ఐపీఎల్-15వ సీజన్‌కు స్వాగతం పలకనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం.!
భారీ మార్పులు వచ్చాయి..శనివారం ప్రారంభం కానున్న ఐపీఎల్- 15వ సీజన్‌లో భారీ మార్పులు వచ్చాయి. కొత్తగా రెండు జట్లు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనుండగా.. కొంత మంది ఆటగాళ్లు జట్లు మారారు, జట్ల కెప్టెన్లు మారారు. ఇటు చెన్నై, అటు కోల్‌కతా ఇరు జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్‌ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్ ధోనీ కూడా అనూహ్య నిర్ణయం తీసుకుని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం.!
ఆ ఒక్కటి తప్ప..ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మినహా చెన్నై జట్టులో పెద్ద సమస్యలేం కనిపించడం లేదు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన సీఎస్కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ జట్టులో దాదాపు అందరూ పాత ఆటగాళ్లే ఉండటం కలిసొచ్చే అంశం. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్ డౌన్‌లో మొయిన్ అలీ ఆడతాడు. అంబటి రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావోలతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. డ్వెయిన్ ప్రిటోరియస్, శివమ్ దూబె వంటి హిట్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఆడమ్ మిల్నె, మహేశ్ తీక్షణ, రాజవర్థన్ హంగార్గేకర్ తదితరలతో పేస్ విభాగం మెరుగ్గానే ఉంది. అయితే, వీసా సమస్యలతో తొలి మ్యాచ్‌కు ఇంగ్లాండ్ ఆటగాడు మెయిన్ అలీ దూరం కానున్నాడు. మరోవైపు, వేలంలో భారీ ధర పలికిన దీపక్ చాహర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది.