IPL 2022 CSK: గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసి లీగ్‌లోకి ప్రవేశించింది. కానీ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 131 పరుగులే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇక గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 210 భారీ స్కోరు సాధించినా లాభం లేకుండాపోయింది. లీగ్ చరిత్రలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం సీఎస్కేకు ఇదే మొదటి సారి.
క్యాచ్‌లు పడితేనే విజయం: క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తామని చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 210/7 పరుగుల భారీ స్కోర్ సాధించినా చివరి ఓవర్‌లో ఓటమిపాలైంది. ఆరో ఓవర్లో మొయిన్ క్యాచ్ వదిలేయడంతో డికాక్, ఎనిమిదో ఓవర్లో తుషార్ పాండే క్యాచ్ జారవిడవడంతో రాహుల్ బతికిపోయారు. అలా క్యాచ్‌లు వదిలేయడమే తమ జట్టు ఓటమికి కారణమని జడేజా పేర్కొన్నాడు. "మాకు శుభారంభం దక్కింది. రాబిన్ ఉతప్ప, శివమ్ మావి అద్భుతంగా ఆడారు. అయితే, మేం ఫీల్డింగ్‌లోనే విఫలమయ్యాం. మా ఆటగాళ్లు ఆ రెండు క్యాచ్‌లను అందుకోవాల్సింది. క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తాం. అలాగే మైదానంలో తేమ కూడా చాలా ఉంది. దీంతో బంతిని పట్టుకోవడం కష్టమైంది. ఇకపై తడి బంతితో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయాల్సింది" అని జడేజా చెప్పుకొచ్చాడు.
మైదానం నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది: గతరాత్రి లఖ్‌నవూ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలయ్యాక చెన్నై జట్టు ప్రధాన కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మంచు విపరీతంగా కురుస్తుందని అన్నాడు. ఆ సమయంలో మైదానం నయాగరా జలపాతాన్ని తలపిస్తుందని చెప్పాడు. "లఖ్‌నవూ జట్టు బ్యాటర్లు బాగా ఆడారు. వారు కొట్టిన బంతులు పట్టుకోవడం చాలా కష్టమైంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేయడం కత్తి మీద సాము లాంటిది" అని అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుండగా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ .. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
అరుదైన క్లబ్‌లోకి ధోనీ:టీమ్ఇండియా మాజీ కెప్టెన్.. సీఎస్‌కే ఆటగాడు ఎంఎస్ ధోనీ టీ20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చిన ధోని ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ధోని.. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కనబరిచాడు. ధోనీ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీ20 క్రికెట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీమ్ఇండియా ప్లేయర్లలో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆరో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ 10,326 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 9936 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ మైలురాయిని అందుకున్న మొదటి వికెట్ కీపర్- బ్యాటర్ ధోనీనే.
ఇదీ చదవండి:'యువీ వికెట్‌తో నా జీవితమే మారిపోయింది'