IPL 2022 CSK VS LSG: ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచుల్లో ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు నేడు(గురువారం) తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు విఫలమవ్వడానికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బలంగా లేకపోవడమనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ తమ తప్పులు సరిదిద్దుకుని గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి. బ్రబౌర్న్ వేదికగా సాయంత్రం రాత్రి 7.30 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం.
జట్టు సమష్టిగా రాణిస్తేనే.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన సీఎస్కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసి లీగ్‌లోకి ప్రవేశించింది. కానీ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 131 పరుగులే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం మాజీ సారథి ధోనీ తప్ప మిగతా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు చేతులెత్తేశారు. కొత్త సారథి రవీంద్ర జడేజా(26*), శివమ్ దుబే కూడా ఆకట్టుకోలేకపోయారు. వీళ్లందరూ ఈ సారి మంచి స్కోరును నమోదు చేయాలి. అయితే మొయిన్ అలీ తిరిగి జట్టులోకి చేరడం, బెంచ్‌లో డ్వైన్ ప్రీటోరియస్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. బ్రావో మినహా అందరూ విఫలమయ్యారు. ఎక్కువ పరుగులను సమర్పించుకున్నారు. అతనొక్కడే తక్కువ పరుగులు ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.