సెప్టెంబరు 20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన రెండో టీ20.. సూపర్ ఓవర్‌కు దారి తీయగా ఉత్కంఠపోరులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత శ్రేయస్ అయ్యర్ జట్టు 157/8 పరుగులు చేయగా తర్వాత కేఎల్ రాహుల్ టీమ్ కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ అంటే ఏమిటి? ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారు? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.
తొలిసారిగా 2008లో
2008లో తొలిసారిగా సూపర్ ఓవర్ పద్ధతిని టీ20ల్లో ప్రవేశపెట్టారు. అంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో మ్యాచ్ టై అయితే బౌల్ అవుట్ పద్దతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఇందులో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు ఐదు బంతులతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. 2007 టీ20 ప్రపంచక్‌పలో భారత్, పాక్ మ్యాచ్ టై అయితే ఈ పద్ధతినే అవలంబించారు. ఆ తర్వాత ఈ రూల్ మారింది. ఐసీసీ నిబంధన 16.9.4డి ప్రకారం.. ఒక మ్యాచ్‌లో తలపడిన రెండు జట్ల స్కోర్లు సమానమైనప్పుడు విజేత కోసం సూపర్ ఓవర్ నిబంధన తీసుకొచ్చారు. ఒక ఓవర్ ఎలిమినేటర్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇరు జట్లు ఆరు బంతులను మాత్రమే ఆడతాయి. ఈ ఆరు బంతుల్లో ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే విజేత.
సూపర్ ఓవర్ ఎలా ఆడతారు?
టీ20ల్లో ముందుగా ప్రతిజట్టు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేసుకుంటుంది. మ్యాచ్‌లో ఏ జట్టైతే రెండో ఇన్నింగ్స్ చేస్తుందో ఆ జట్టు సూపర్ ఓవర్‌ను మొదటగా ఆడుతుంది. ఇందులో రెండు వికెట్ల వరకే పరిమితి.
ఏ జట్టు అయితే అత్యధిక పరుగులు చేస్తుందో వారే విజేతలు. ఒకవేళ సూపర్ ఓవర్ టై అయినా.. అందులో ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్‌ను కొనసాగిస్తారు.