తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో 'టాస్' లెక్క తప్పుతోంది! - UAE IPL 2020

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో టాస్ విషయంలో కెప్టెన్ల లెక్క తప్పుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? కారణాలేంటి?

UAE IPL 2020 toss special story
ఐపీఎల్​లో 'టాస్' లెక్క తప్పుతోంది!

By

Published : Sep 26, 2020, 5:57 PM IST

'మ్యాచ్‌లో టాస్‌ ఎంతో కీలకం. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల్ని, జట్టు బలాన్ని బట్టి కెప్టెన్‌ బ్యాటింగ్‌ లేదా బౌలింగ్ ఎంచుకుంటాడు'.. ఇవి క్రికెట్‌ నిపుణులే కాదు, సగటు అభిమాని చెప్పే మాటలు. ఎందుకంటే ఏ పోరులోనైనా టాస్‌ అత్యంత కీలకం. ప్రత్యర్థిపై చేసే జైత్రయాత్రలో అదే ప్రధాన ఆయుధం. పరిస్థితుల్ని అంచనా వేసి మనం ఎంచుకునే బ్యాటింగ్‌/బౌలింగ్‌ సమరంలో ప్రత్యర్థులకు కఠిన సవాలుగా మారుతుంటుంది.

కానీ యూఏఈలో జరుగుతున్న ఈ ఐపీఎల్​లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. టాస్‌ గందరగోళానికి గురిచేస్తోంది. సారథి వేసిన ఎత్తులు ఫలించట్లేదు. అంచనాలు పూర్తిగా తలకిందులైతున్నాయి. అది కేవలం ఒక్క మ్యాచ్‌లో కాదు.. ఏకంగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన జట్టే పరాజయాన్ని చవిచూసింది. అసలు ఎందుకిలా అంచనాలు తారుమారవుతున్నాయి?

దుబాయ్ క్రికెట్ మైదానం

తేమ కారణమా?

సాధారణంగా టీ20లు రాత్రి 7 లేదా 8 గంటలకు ప్రారంభమవుతుంటాయి. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభమయ్యే సమయానికి తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బౌలర్లకు బంతిపై పట్టు సడలుతుంటుంది. దీంతో టాస్‌ గెలిచిన సారథి ఎక్కువగా బౌలింగ్‌ ఎంచుకుంటాడు. కానీ యూఏఈలో జరుగుతున్న టోర్నీలో అంచనాలు మారిపోతున్నాయి. ఊహించని విధంగా తేమ ప్రభావం చూపట్లేదు. ఛేదన సులువనుకున్న జట్లు కంగుతింటున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు విజయాలు సాధిస్తున్నాయి.

కేవలం తేమపై అంచనాలు విఫలం కావడమే వైఫల్యాలకు కారణం కాదని నిపుణులు భావిస్తున్నారు. బెంగళూరుతో మ్యాచ్‌లో హైదరాబాద్‌ మిడిలార్డర్‌ బలహీనతతో ఆ జట్టు ఓడిపోయింది. రాజస్థాన్‌, దిల్లీతో మ్యాచ్‌లో చెన్నై పేలవమైన ఆరంభం, మధ్య ఓవర్లలో నిదానమైన బ్యాటింగే వారి పరాజయానికి కారణం. యూఏఈ వాతావరణ పరిస్థితులకు ఆటగాళ్లు ఇంకా అలవాటు పడకపోవడం మరో సమస్య. ఇప్పటివరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లన్నీ పోటీ ఇచ్చే లక్ష్యాలనే నిర్దేశించాయి. పంజాబ్‌కు దిల్లీ ఇచ్చిన టార్గెట్‌ 158 పరుగులు ఇప్పటివరకు అత్యల్పం. ఓటములకు ఇలా భిన్నమైన కారణాలు ఉండటం వల్ల టాస్‌ గెలిస్తే ఏది ఎంచుకోవాలనే ప్రశ్న కెప్టెన్లకు ఎదురవుతోంది. చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ సైతం తేమపై తమ అంచనాలు తలకిందులవుతున్నాయని చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.

"మేం తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవాలనుకున్నాం. కానీ తేమ ప్రభావాన్ని ఊహించలేమని ప్రణాళిక మార్చాం. అయితే మా అంచనాలు తలకిందులయ్యాయి. మేం ఊహించనట్లుగా తేమ లేదు. షార్జా వేదికగా ఆడిన ఆఖరి మ్యాచ్‌లో మాత్రం తేమ ఉంది. మేం ఎదుర్కొన్న ఈ పరిస్థితులు టోర్నీలో మమ్మల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాయి" - దిల్లీ చేతిలో ఓటమి అనంతరం చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌

ABOUT THE AUTHOR

...view details