మహిళల టీ20 లీగ్ మూడో సీజన్ విజేతగా ట్రయల్‌బ్లేజర్స్ నిలిచింది. షార్జా వేదికగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను 16 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (68) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం బరిలోకి దిగిన సూపర్‌నోవాస్ 20 ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 102 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్ (30) టాప్ స్కోరర్. సాల్మ (3/18), దీప్తి (2/9) ఆ జట్టును దెబ్బతీశారు.
ఛేదనకు దిగిన సూపర్‌నోవాస్ ఏ దశలోనూ పైచేయి సాధించలేదు. దీప్తి శర్మ ధాటికి 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శశికళ (19)తో కలిసి హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కాగా, దూకుడుగా ఆడే క్రమంలో శశికళ వెనుదిరిగింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ తన పోరాటం కొనసాగించింది. అడపాదడపా బౌండరీలు సాధిస్తున్నప్పటికీ కావాల్సిన రన్‌రేటు భారీగా పెరిగిపోయింది. ఆఖరి 12 బంతుల్లో 27 పరుగులు అవసరమవగా.. సాల్మ మూడు వికెట్లు తీసి 4 పరుగులే ఇవ్వడం వల్ల సూపర్‌నోవాస్ ఓటమి ఖరారైంది. సూపర్‌నోవాస్‌లో ఛామరి (6), జెమిమా (13), తానియా భాటియా (14), అనూజ (8), రాధ (5*), షకీరా (4*) పరుగులు చేశారు. ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్లలో సాల్మ మూడు, దీప్తి రెండు, సోఫియా ఒక వికెట్ తీశారు.