తెలంగాణ

telangana

ETV Bharat / sports

కసితో రాయుడు బ్యాటింగ్.. త్రీడీ కళ్లద్దాలు మర్చిపోలేదేమో! - రాయుడు అర్ధసెంచర

జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, సహనం అవసరం అంటుంటారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు . కానీ, ఒక్కోసారి కసి, అసహనం కూడా మనిషిని లక్ష్యం వైపు తీసుకెళతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తెలుగు తేజం అంబటి రాయుడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో ఇది కనిపిస్తున్నట్లు ఉంది.

The reason behind Rayudu success
కసిగా ఆడిన రాయుడు

By

Published : Sep 20, 2020, 2:54 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఏడాది క్రితం వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్ విజయావకాశాల గురించి ఎంతలా మాట్లాడుకున్నారో త్రీడీ కళ్లద్దాల గురించీ అంతే చర్చించుకున్నారు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనప్పుడు, తన ప్రదర్శనకు గుర్తింపు రాకుండా పోయిందనే ఆవేదనతో సెలెక్టర్లను ఉద్దేశిస్తూ అంబటి రాయుడు పరోక్షంగా చేసిన వ్యంగ్యాత్మక 'త్రీడీ కళ్లద్దాల' ట్వీట్​ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

చెన్నై-ముంబయి

తనని జట్టులోకి తీసుకోకపోవడం కన్నా ఆ విషయం పద్ధతి ప్రకారం చెప్పకపోవడం.. రాయుడు కసి, అసహనానికి కారణం. ఆ కారణంగా ఇంకా కనీసం 4-5 ఏళ్ల కెరీర్ ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కొన్నాళ్ల తర్వాత తనలో ఇంకా క్రికెట్ ఉందని గుర్తించాడో ఏమో.. నెలన్నర తర్వాతే దానిని వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించాడు. అప్పటికి భారత జట్టు విరివిగా సిరీస్​లు ఆడుతోంది. గత ఆగస్టులో మళ్లీ క్రికెట్ ఆడతానని ప్రకటించిన దగ్గర నుంచి తనను తాను ఫిట్​గా ఉంచుకుంటూ టెక్నిక్ కాపాడుకుంటూ వచ్చాడు.

2018 ఐపీఎల్ నుంచి చెన్నై జట్టులో ఉన్న రాయుడు.. ఆ సీజన్లో ఓపెనర్​గా దిగి 16 ఇన్నింగ్స్​ల్లో 602 పరుగులు చేసి సీఎస్కే టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది మిడిల్ ఆర్డర్​లో ఆడి, ముందు సీజన్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. ప్రస్తుత సీజన్​లో ఎలా రాణిస్తాడన్న సందేహాలకు తొలి మ్యాచ్​లోనే మంచి సమాధానం ఇచ్చాడు.

రాయుడు

మిస్టర్ ఐపీఎల్​గా పేరు తెచ్చుకున్న రైనా.. ఈసారి మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. వన్​డౌన్​లో వచ్చి ఇన్నింగ్స్​ను నిలబెట్టే బాధ్యత ఎప్పుడూ రైనాదే. ఈసారి అతడు లేకపోవడం వల్ల ఆ స్థానంలో వచ్చే డుప్లెసిస్ కానీ, తర్వాత వచ్చే రాయుడు కానీ ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి మ్యాచ్​లో ఇద్దరూ బాగానే ఆడినా.. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో వచ్చి మరీ రాయుడు ఎదురుదాడికి దిగడం.. సీఎస్కే అభిమానుల్ని కట్టిపడేసింది. బలమైన బౌలింగ్ దళం ఉన్న ముంబయిని ఎదుర్కొంటూ కావాల్సిన రన్​రేట్ అదుపులోనే ఉండేలా చూసుకుంటూ చెన్నైని లక్ష్యం వైపు నడిపించాడు. ఆఖర్లో ఔట్ అయినా అతడి మంచి ఇన్నింగ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తెచ్చిపెట్టింది. సీజన్ మొత్తం ఇదే ఫామ్ కొనసాగిస్తే రైనా లేని లోటును అతడు భర్తీ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చేసినందున బాగా రాణిస్తే మళ్లీ టీమ్​ఇండియా జెర్సీ ధరించే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. ఎందుకంటే గతేడాది ప్రపంచకప్ తర్వాత కొన్ని నెలలకే కొత్త సెలక్షన్ ప్యానెల్ ఏర్పాటైంది. పాత ప్యానెల్ వైఖరిపై రాయుడు అసంతృప్తి సరైనదే అయితే... ప్రస్తుత ప్యానెల్ దృష్టిలో పడేలా అతను ఐపీఎల్​లో దుమ్ము రేపాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ పరుగులు చేసినంత మాత్రాన రాయుడు జాతీయ జట్టులోకి వచ్చేస్తాడా? అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వన్డే ఫార్మాట్​లో నాలుగో స్థానంలో అయ్యర్ నిలదొక్కుకుంటున్నాడు. వెంటనే అతడ్ని తప్పించి రాయుడును ఆడించడం కష్టమే. కానీ ఇంకా అవకాశం మాత్రం ఉంది. మొత్తానికి రాయుడు భవిష్యత్​కు ఈ ఐపీఎల్ చాలా కీలకంగా మారింది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details