తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 9:35 AM IST

ETV Bharat / sports

సూపర్‌ సందీప్‌: బుమ్రాకూ లేదీ ఘనత

ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరబాద్​కు భువీ లేని లోటును తీరుస్తున్నాడు సందీప్​ శర్మ. పవర్​ప్లేలో వికెట్లు తీస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లీగ్‌ చరిత్రలోనే ఎక్కువగా ఓపెనర్లు, వన్‌డౌన్‌ ఆటగాళ్లను పెవిలియన్‌ పంపించిన రికార్డు సొంతం చేసుకున్నాడు‌.

sunrisers hyderabad bowler sandeep sharma created new record in ipl history
సూపర్‌ సందీప్‌: బుమ్రాకూ లేదీ ఘనత

బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ఆరంభ, ఆఖరి ఓవర్లలో హైదరాబాద్‌కు అండగా నిలిచే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. తెలివిగా బంతులేస్తూ వికెట్లు తీస్తాడు. పరుగులను నియంత్రిస్తాడు. గాయ పడటంతో ఈ సీజన్లో కేవలం 4 మ్యాచులే ఆడి స్వదేశానికి తిరిగివెళ్లిపోయాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సందీప్‌ శర్మ జట్టుకు ప్రధాన పేసర్‌గా మారాడు. భువీ లేని లోటు తీరుస్తున్నాడు. బంతిని మరీ వేగంగా విసరకపోయినా పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ విజయాలను అందిస్తున్నాడు. తాజాగా అతడు జహీర్‌ ఖాన్‌ రికార్డును బద్దలుకొట్టేశాడు.

వైవిధ్యాలేమీ లేకపోయినా...

ఐపీఎల్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, సందీప్‌ శర్మ 90 మ్యాచులు ఆడారు. బుమ్రా రన్నప్‌ నుంచి బంతుల వరకు అంతా వైవిధ్యంగా ఉంటుంది. అత్యంత వేగంగా బంతులు విసురుతాడు. అటు పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లలో వికెట్లు తీస్తాడు. కానీ సందీప్‌కు అలాంటి వైవిధ్యాలేమీ లేవు. మీడియం పేసర్‌. రన్నప్‌ సైతం సాధారణంగానే ఉంటుంది. అయితే పవర్‌ప్లేలో మాత్రం అతడు దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఎక్కువ ఓపెనర్లు, వన్‌డౌన్‌ ఆటగాళ్లను పెవిలియన్‌ పంపించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. 90 మ్యాచుల్లో 24.02 సగటు, 7.75 ఎకానమీతో 108 వికెట్లు తీస్తే.. అందులో 62 వికెట్లు ఓపెనర్లు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌కే కావడం విశేషం. గతంలో ఇలాంటి రికార్డు జహీర్‌ పేరుతో ఉండేది.

ఎదురుదాడికి దిగినా బెదరడు..

చాలా సింపుల్‌గా బంతులేసే సందీప్‌ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కీర్తించే విరాట్‌ కోహ్లీని 13 మ్యాచుల్లో 7 సార్లు ఔట్‌ చేశాడు. రోహిత్‌ను 14 మ్యాచుల్లో నాలుగు సార్లు, ఇక యూనివర్స్‌ బాస్‌, టీ20 వీరుడు క్రిస్‌గేల్‌నూ 11 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు పెవిలియన్‌ పంపించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎదురుదాడికి దిగినా సందీప్‌ భయపడడు. షార్జా వేదికగా జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచులో సందీప్‌ వేసిన ఐదో ఓవర్లో డికాక్‌ వరుసగా 4, 6, 6తో విజృంభించాడు. అయితే ఆ తర్వాతి బంతిని స్టంప్స్‌కు దూరంగా విసిరి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో అతడిని పెవిలియన్‌కు పంపించాడు ఈ పేసర్‌.

ఇదీ చూడండి:వన్డే ర్యాంకింగ్స్: టాప్​లోనే కోహ్లీ-రోహిత్ శర్మ

ABOUT THE AUTHOR

...view details