తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​పై రాజస్థాన్​దే గెలుపు

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాళ్లు రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్ ఉత్కంఠభరిత మ్యాచ్​లో రాయల్స్​కు విజయాన్నందించారు.

SRH VS RR: Parag, Tewatia help Rajasthan beat Hyderabad by 5 wickets
సన్​రైజర్స్​పై రాజస్థాన్​దే గెలుపు

By

Published : Oct 11, 2020, 7:58 PM IST

Updated : Oct 11, 2020, 9:14 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఆ జట్టును రాహుల్‌ తెవాతియా(45; 28 బంతుల్లో 4x4, 2x6), రియాన్‌ పరాగ్‌(42; 26 బంతుల్లో 2x4, 2x6) ఆదుకున్నారు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి విజయాన్ని అందించారు.

మోస్తారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ తొలుత తడబడింది. హైదరాబాద్‌ బౌలర్లు రెచ్చిపోవడం వల్ల టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు బెన్‌ స్టోక్స్‌(5), బట్లర్‌(16)తో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(5), సంజూ శాంసన్‌(26), రాబిన్‌ ఉతప్ప(18) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఓటమి తప్పదనుకున్న సమయంలో తెవాతియా, పరాగ్‌ నిలకడగా ఆడారు. ఆ క్రమంలోనే చివర్లో రన్‌రేట్‌ పెరగడం వల్ల ధాటిగా ఆడి ఆ జట్టుకు మూడో విజయాన్ని నమోదు చేశారు. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ఖాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మనీష్‌ పాండే(54; 44 బంతుల్లో 2x4, 3x6), డేవిడ్‌ వార్నర్‌(48; 38 బంతుల్లో 3x4, 2x6) రాణించారు. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(16) ఐదో ఓవర్‌లోనే వెనుతిరిగాడు. కార్తీక్‌ త్యాగి వేసిన ఈ ఓవర్‌లో తొలుత ఒక సిక్సర్‌ బాదిన అతడు తర్వాతి బంతిని కూడా మరో షాట్ ఆడబోయి సంజూ శాంసన్‌ చేతికి చిక్కాడు. దాంతో హైదరాబాద్‌ 23 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం వార్నర్‌, మనీష్‌ పాండే వికెట్‌ కాపాడుకొని రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధ శతకానికి దగ్గరగా ఉన్న వార్నర్​ను ఆర్చర్‌ పెవిలియన్ చేర్చాడు. ఆపై పాండే ధాటిగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకోగా కాసేపటికే ఉనద్కత్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో విలియమ్సన్‌(22; 12 బంతుల్లో 2x6), ప్రియమ్‌గార్గ్‌(15; 8 బంతుల్లో 1x4, 1x6) రెచ్చిపోయి ఆడడం వల్ల రాజస్థాన్‌ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, కార్తీక్‌, ఉనద్కత్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Last Updated : Oct 11, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details