తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్​ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి

ఐపీఎల్​ ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫైయర్​-2 మ్యాచ్​కు వార్నర్​సేన చేరుకుంది. ఆదివారం జరగనున్న తుదిపోరుకు అర్హత మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో సన్​రైజర్స్​ తలపడనుంది.

By

Published : Nov 6, 2020, 11:30 PM IST

SRH vs RCB: Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 6 wickets
వార్నర్​ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి

అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్​ ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుపై సన్​రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 132 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఇన్నింగ్స్​లో మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్​ గెలుపొందింది. కేన్​ విలియమ్సన్​ అర్ధశతకంతో అలరించగా.. జాసన్​ హోల్డర్​ ఆల్​రౌండర్​ ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ ​విజయంతో వార్నర్​ సేన క్వాలిఫైయర్​-2 మ్యాచ్​కు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న తుదిపోరుకు అర్హత పోరులోో దిల్లీ క్యాపిటల్స్​తో వార్నర్​సేన తలపడనుంది.

హోల్డర్​ మాయాజాలం

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. సన్​రైజర్స్​ హైదరాబాద్​కు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. బెంగళూరు ఏ దశలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ (6)ని రెండో ఓవర్‌లోనే హోల్డర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తన తర్వాతి ఓవర్‌లో పడిక్కల్‌ (1)నూ ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్‌తో కలిసి ఫించ్‌ (32) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, షాబాజ్‌ వేసిన 9వ ఓవర్‌లో భారీషాట్‌కు యత్నించి ఫించ్‌ ఔటయ్యాడు. అదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (0) ఫ్రీహిట్ బంతికి రనౌటయ్యాడు. దీంతో బెంగళూరు 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

డివిలియర్స్​ హాఫ్​సెంచరీ

బెంగళూరు బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్ తన పోరాటం కొనసాగించాడు. సహచరుల నుంచి సహకారం లభించకపోయినా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. కానీ 18వ ఓవర్‌లో నటరాజన్‌ వేసిన అద్భుత యార్కర్‌కు క్లీన్‌బౌల్డయ్యాడు. సిరాజ్ (10*), సైని (8*) పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లల్లో హోల్డర్‌ మూడు, నటరాజన్‌ రెండు, షాబాజ్‌ ఒక వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details