తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన పంజాబ్​ - సీఎస్కే స్క్వాడ్ టుడే

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 69 పరుగుల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన రాహుల్ ​సేన కేవలం 132 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యింది. దీంతో టోర్నీలో మూడో విజయాన్ని ఎస్​ఆర్​హెచ్​ నమోదు చేసుకుంది.

SRH vs KXIP: Sunrisers Hyderabad beat Kings XI Punjab by 69 runs
సన్​రైజర్స్​ హైదరాబాద్​

By

Published : Oct 9, 2020, 12:00 AM IST

అద్భుతమైన విజయంతో అభిమానులను మురిపించింది హైదరాబాద్‌. సీజన్‌ ఆరంభమయ్యాక తొలిసారి అంచనాలను మించి రాణించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసింది. పంజాబ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 202 పరుగుల లక్ష్య ఛేదనలో నికోలస్‌ పూరన్‌ (77) భీకరమైన సిక్సర్లతో భయపెట్టినా మిగిలిన వికెట్లను పడగొట్టి వార్నర్‌‌ సేన విజయ బావుటా ఎగరేసింది. అంతకు ముందు హైదరాబాద్‌ ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో (97), డేవిడ్‌ వార్నర్‌ (52) వీరవిహారం చేశారు.

పూరన్‌.. సై‘రన్‌’

పంజాబ్‌ ఛేదనను ఆరంభించిన తీరు చూస్తే ఎవరికీ గెలుపు ఆశలు కనిపించలేదు. రెండో ఓవర్లో అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించి మయాంక్‌ (9) రనౌట్‌ అయ్యాడు. 4వ ఓవర్​ 2వ బంతికి సిమ్రన్‌ సింగ్‌ (11) క్యాచ్‌ను ప్రియమ్‌గార్గ్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. మరికాసేపటికే కేఎల్‌ రాహుల్‌ (11; 16 బంతుల్లో)ను అభిషేక్‌శర్మ పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో 58కే 3 వికెట్లతో కష్టాల్లో పడ్డ పంజాబ్‌కు నికోలస్‌ పూరన్‌ (77) ఊపిరి పోశాడు. వరుస సిక్సర్లతో ఆశలు రేపాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన 9వ ఓవర్లో 6, 4, 6, 6, 6 బాదేసి ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. 17 బంతుల్లోనే అర్ధశతకం చేసి హైదరాబాద్‌ను భయపెట్టాడు.

కొత్త బౌలర్లు ఇబ్బంది పడటంతో సీనియర్‌ బౌలర్లు రంగంలోకి దిగారు. పూరన్‌ ఉన్నప్పటికీ అవతలి ఎండ్‌లో ఎవరినీ నిలదొక్కుకోనివ్వలేదు. అతడితో భాగస్వామ్యం నెలకొల్పకుండా అడ్డుకున్నారు. పవర్‌ప్లేలో ఖలీల్‌ అహ్మద్‌ (2/24) వికెట్లు తీయగా.. మధ్య ఓవర్లలో రషీద్‌ ఖాన్‌ (3/12), నటరాజన్‌ (2/24) ఆ పని చూసుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. జట్టు స్కోరు 105 నుంచి వరుసగా మాక్స్‌వెల్‌ (7), మన్‌దీప్‌ సింగ్‌ (6), ముజీబుర్‌ రెహ్మాన్‌ (1)ను ఔట్‌ చేశారు. పూరన్‌ క్రీజులో ఉండి అద్భుతం చేస్తాడా అనుకున్నా.. 14.5వ బంతికి రషీద్‌ అతడిని బోల్తా కొట్టించాడు. దాంతో పంజాబ్‌ ఓటమికి మరెంతో సమయం పట్టలేదు. 16.5 ఓవర్లకు 132కే కుప్పకూలింది. రాహుల్‌ సేన ఆఖరి ఏడుగురు చేసిన మొత్తం 20 పరుగులే కావడం గమనార్హం.

డేవీ+స్టో.. విధ్వంసం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ తొలిసారి సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. దుబాయ్‌ స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో (97), డేవిడ్‌ వార్నర్‌ (52) తొలి ఓవర్‌ నుంచే బాదుడు షురూ చేశారు. షెల్డన్‌ కాట్రెల్‌ను మినహాయించి ప్రతి ఒక్కరి ఓవర్లోనూ దంచికొట్టారు. వారిద్దరూ తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్‌ప్లే ముగిసేసరికే 58గా ఉన్న స్కోరును 10 ఓవర్లకు 100గా మలిచారు.15 ఓవర్లకు 160/0తో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. దాంతో హైదరాబాద్‌ స్కోరు సులభంగా 230 దాటేలా కనిపించింది.

అయితే పంజాబ్‌ కుర్ర బౌలర్లు రవి బిష్ణోయ్‌ (3/29), అర్షదీప్‌ సింగ్‌ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 16వ ఓవర్లో వార్నర్‌, బెయిర్‌ స్టోను రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కు చేర్చి వార్నర్‌ సేనను దెబ్బకొట్టాడు. అప్పుడు జట్టు స్కోరు 160. తర్వాతి ఓవర్లోనే మనీశ్‌ పాండే (1)ని అర్షదీప్‌ ఔట్‌ చేశాడు. అబ్దుల్‌ సమద్‌ (8), ప్రియమ్‌ గార్గ్‌ (0)ను సైతం వారు ఎక్కువసేపు నిలవనీయలేదు. అయితే చివర్లో అభిషేక్‌ శర్మ (12; 6 బంతుల్లో 1×4, 1×6), కేన్‌ విలియమ్సన్‌ (20*) బౌండరీలు బాదడం వల్ల హైదరాబాద్‌ 201/6తో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details