యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్లో దిల్లీ జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇంకా ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో కనీసం రెండు తప్పకుండా గెలిచే వీలుంది. అంటే ఎలాంటి సందేహం లేకుండా ఆ జట్టు కచ్చితంగా అక్కడికి చేరుకుంటుందనే అనిపిస్తోంది. అయితే, అక్కడ కూడా ఇలాగే విజయాలు సాధిస్తే తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా కప్పు సాధించే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ చెలరేగిపోడానికి అసలు కారణాలేంటో పరిశీలిద్దాం..
చిన్నోడైనా గట్టోడే..
దిల్లీ 2015లో శ్రేయస్ అయ్యర్ అనే కుర్రాడిని జట్టులోకి తీసుకుంది. రూ.2.6 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. దాంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. తనపై యాజమాన్యం పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ చెలరేగిపోయాడు. ఆ సీజన్‌లో 439 పరుగులు చేసి నిలకడైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
2016లో విఫలమైనా దిల్లీ అలాగే అట్టిపెట్టుకుంది. 2017లో 338 పరుగులు చేయగా 2018లో 411 పరుగులు సాధించాడు. దీంతో అతడిలోని నిలకడైన బ్యాటింగ్, ముంబయికి రంజీల్లో సారథ్యం వహించడం చూసిన దిల్లీ.. ఆ సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌ను తొలగించి శ్రేయస్‌కు జట్టు పగ్గాలు అందించింది.
అలా మెగా క్రికెట్ లీగ్‌లోనే పిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే, అప్పుడే అనుకున్న ఫలితాలు రాలేదు. ఆ సీజన్‌లో దిల్లీ చివరి స్థానంలో నిలిచింది. కానీ, 2019లో శ్రేయస్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేసి.. 2012 తర్వాత దిల్లీని తొలిసారి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే తాజా సీజన్‌లోనూ మళ్లీ రెచ్చిపోతున్నాడు.
అండగా పాంటింగ్, దాదా
చిన్న వయసులోనే కెప్టెన్‌గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఎదుగుదల వెనుక ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు. వారే రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ. 2018లో దిల్లీ తమ జట్టును ప్రక్షాళన చేసింది. అప్పటికి టోర్నీ ఆరంభమై పదేళ్లు గడుస్తున్నా ఒక్కసారీ ఫైనల్ చేరలేదు. దీంతో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. గంగూలీని మెంటార్‌గా నియమించుకుంది. వీరిద్దరూ వారి జాతీయ జట్లకు సిసలైన సారథులుగా పేరు తెచ్చుకున్నారు. ఆసీస్‌ను పాంటింగ్ రెండుసార్లు జగజ్జేతగా నిలపగా.. ఫిక్సింగ్ నీడల నుంచి బయటకు తీసుకొచ్చి భారత్‌ను అజేయంగా మార్చాడు దాదా. వారిద్దరి ఆలోచనలు, వ్యూహ చతురతను శ్రేయస్ అందిపుచ్చుకున్నాడు.
చిన్న వయసులోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో నాయకుడిగా ఆకట్టుకుంటున్నాడు. సరైన దిశలో మ్యాచ్ విన్నర్లను బరిలోకి దించుతున్నాడు. దీంతో జట్టులో సమష్టితత్వం, సమతూకం తీసుకొచ్చాడు. ఒకరు విఫలమైనా ఇంకొకరు ఆ బాధ్యతలను పూర్తి చేసే విధంగా ఆటగాళ్లను నడిపిస్తున్నాడు. శ్రేయస్ సారథ్యంలో టీ20 టైటిల్‌ను సాధించాలని పాంటింగ్ సైతం పట్టుదలగా ఉన్నాడు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఎడారి నేలపై జరుగుతున్న లీగ్‌లో శ్రేయస్ సేన విజయాల పరంపర కొనసాగిస్తోంది.
మూమెంట్స్‌ను గెలుస్తున్నాడు
ఏ జట్టైనా విజయం అందుకోవాలంటే మ్యాచులోని చిన్న చిన్న మూమెంట్స్‌ను గెలవాలి. ఉదాహరణకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే సరైన బౌలర్‌ను ప్రయోగించి వికెట్లు తీయించాలి. టాప్ ఆర్డర్ విఫలమైతే వికెట్లు పడకుండా అడ్డుకొని.. మళ్లీ గేరుమార్చి పరుగుల వరద పారించాలి. శ్రేయస్ ఇలాంటి మూమెంట్స్‌ను చక్కగా ఒడిసిపడుతున్నాడు. ఆల్‌రౌండర్ స్టాయినిస్, అక్షర్ పటేల్‌ను సరైన సమయంలో వాడుకుంటున్నాడు. రబాడాను అటు పవర్‌ప్లే, ఇటు డెత్ ఓవర్లలో వికెట్లు తీసేలా ప్రయోగిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో ఆదుకుంటున్నాడు. షార్జా వేదికగా కోల్‌కతా మ్యాచే ఇందుకు ఉదాహరణ.
పృథ్వీషా (66) రాణించినప్పటికీ.. షార్జాలో 200 దాటితేనే విజయం సాధించగలరు. అందుకే వన్‌డౌన్‌లోనే వచ్చి 38 బంతుల్లోనే 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ మ్యాచులో.. షా డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో రహానె (2) విఫలమయ్యాడు. అప్పుడు ధావన్ (57)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2 సిక్సర్లు, 3 బౌండరీలతో 43 బంతుల్లో 53తో అజేయంగా నిలిచాడు. దాంతో ప్రత్యర్థికి దిల్లీ 162 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. మ్యాచూ గెలిచింది.
ఈ ఏడాది క్రీజులోకి దిగిన ప్రతిసారీ.. శ్రేయస్ కనీసం 30 పరుగులైనా చేస్తున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసినా దిల్లీ విజయాల్లో శ్రేయస్సే కనిపిస్తున్నాడు. ఈసారి టైటిల్ సాధిస్తాడని ఆశిద్దాం..!