ప్రస్తుత టీ20 ఫార్మాట్లో కొన్ని మార్పులు వస్తే అది మరింత ఆకర్షణీయంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్. దీని కోసం ట్విట్టర్ ద్వారా కొన్ని సూచనలు చేశాడు. బౌలింగ్ పరిమితితో పాటు బౌండరీ లైన్‌ను మరింత దూరంగా ఉండేలా చూడటం వంటి రూల్స్ టీ20 మెరుగవ్వడానికి సహాయపడతాయని సూచించాడు.
"టీ20 క్రికెట్ మరింత మెరుగవ్వడానికి నేను కొన్ని సూచనలు చేస్తున్నా.
(1) ప్రతి స్టేడియంలో వీలైనంత పెద్ద బౌండరీలతో పాటు చిన్న మైదానాల్లోని అవుట్ ఫీల్డ్‌లో గడ్డిని బాగా పెంచాలి.
(2) బౌలర్లకు ప్రస్తుతం ఇస్తున్న నాలుగు ఓవర్ల గరిష్ఠ పరిమితిని 5 ఓవర్లకు పెంచాలి.
(3) టెస్టు మ్యాచ్ 4వ రోజున స్టేడియం ఎలా ఉంటుందో ప్రతి పిచ్ అలానే ఉండాలి. మరీ ఫ్లాట్‌గా ఉండి సిక్సులకు అనుకూలించకుండా.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనువుగా ఉండాలి. బ్యాట్, బాల్‌కు మధ్య పోటీనే మనమందరం కోరుకుంటాం".
- షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
గురువారం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఆరు ఓవర్లలో 104 పరుగులు చేయగలిగింది ముంబయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిన్న బౌండరీలు బౌలర్లను దెబ్బతీస్తున్నాయని తెలిపాడు వార్న్.