ఐపీఎల్ తుదిపోరులో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ముచ్చటగా ఐదోసారి కప్పును ఎగరేసుకుపోవాలని రోహిత్ సేన.. తొలిసారే ఫైనల్ చేరినా టైటిల్ గెలవాలని శ్రేయస్ టీమ్ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం, ముంబయి మాజీ సారథి సచిన్ తెందుల్కర్ సోమవారం ముంబయి జట్టుకు ఓ సందేశం ఇచ్చాడు. ఆ జట్టు తరఫున ఆడటానికి బరిలోకి దిగినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మాత్రమే ఆడరని, అందరి వెనుక బలమైన శక్తి ఉందని పేర్కొన్నాడు.
"జీవితంలో ఎలాగైతే ఒడుదొడుకులు ఉంటాయో ఆటలోనూ అలాగే సవాళ్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ టీ20 లీగ్‌లో కీలక దశకు చేరుకున్నాక అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక జట్టుగా అందరూ కలిసి ఉండటం ఎంతో అవసరం. అలాంటప్పుడే విజయాలు సాధిస్తాం. జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బంది ప్రతి ఒక్కరూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు. ముంబయి జట్టుకు ఆడేటప్పుడు ఎవరూ వ్యక్తిగతంగా ఒక్కరు కాదనే విషయం తెలుస్తుంది."